ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్థాన్‌కు అంతర్జాతీయ సమాజంలో ఛీత్కారాలు తప్పడం లేదు. తాజాగా ఆ దేశానికి ఫ్రాన్స్ దిమ్మదిరిగే షాకిచ్చింది! వారి మిరాజ్ యుద్ధ విమానాలను ఉన్నతీకరించబోమని తెగేసి చెప్పింది. అంతేకాకుండా సరిహద్దుల్లో భారత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మరో కీలక నిర్ణయమూ తీసుకుంది. రఫేల్ యుద్ధ విమానాలను మరమ్మతు చేయించేటప్పుడు పాక్ మూలాలున్న సాంకేతిక నిపుణులను దగ్గరకు రానివ్వొద్దని ఖతార్‌కు స్పష్టం చేసింది.
ఇమ్రాన్ వ్యాఖ్యలతో..
కొన్నాళ్ల క్రితం ఫ్రాన్స్‌లో ఉగ్రదాడులు జరిగాయి. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ స్పష్టం చేశారు. ఆ సమయంలో భారత్ సహా అనేక దేశాలు ఆయనకు మద్దతుగా నిలిచాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మాత్రం భిన్నంగా స్పందించారు. మేక్రాన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకే ఇప్పుడు పాక్‌పై మేక్రాన్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
పాక్ వాయుసేనపై ప్రభావం..
పాకిస్థాన్ వాయుసేనలో ఎక్కువగా మిరాజ్ 3, మిరాజ్ 5 యుద్ధ విమానాలే ఉన్నాయి. ఫ్రెంచ్ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్ వీటిని తయారుచేసింది. ప్రస్తుతం పాక్ వద్దనున్న మిరాజ్ విమానాల్లో కేవలం సగం విహంగాలకే మరమ్మతులు చేయగలరు. ఇప్పుడు ఫ్రాన్స్ వీటి ఉన్నతీకరణకు నిరాకరించడం వల్ల పాక్ వాయుసేనపై తీవ్ర ప్రభావం పడనుంది. అంతేకాకుండా గగన రక్షణ వ్యవస్థ, 'ఆగోస్టా 90బి' తరగతి జలాంతర్గాముల్ని అప్‌గ్రేడ్ చేసేందుకు నిరాకరించింది.
భారత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని..
రఫేల్ యుద్ధ విమానాల మరమ్మతుల సమయంలో పాక్ మూలాలున్న సాంకేతిక నిపుణులను రానీయొద్దని ఖతార్‌కు ఫ్రాన్స్ స్పష్టం చేయడం గమనార్హం. రఫేల్ విమానాల కొనుగోలు సమయంలోనే వీటి రహస్యాలను బయటవారికి తెలియనివ్వకూడదని భారత్ విజ్ఞప్తి చేయడమే ఇందుకు కారణం. సరిహద్దుల్లో మన దేశ ప్రయోజనాలకు భంగం కలగకూడదని ఫ్రాన్స్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇదీ చూడండి: 'కరోనా బాంబులు'గా మారుతున్న ఉగ్రవాదులు