ఫ్రాన్స్‌లో రోజువారీ కొవిడ్ మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కరోనా రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోతున్నాయి. ఈ పరిణామాలు అక్కడి వైద్యులపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయనే ఆందోళన మొదలయ్యింది. ఫలితంగా దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధించాలని అక్కడి వైద్యులు ఫ్రాన్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కరోనా కట్టడికోసం ఫ్రాన్స్ మరోసారి లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
పాఠాలు నేర్వని ఫ్రాన్స్..
కొవిడ్-19 తొలి దఫా విజృంభణతో ఫ్రాన్స్ అతలాకుతలం అయ్యింది. ఇప్పటివరకు అక్కడ 12లక్షల మందిలో వైరస్ బయటపడగా వీరిలో 35వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ వైరస్‌ను పూర్తిగా నియంత్రించలేకపోయింది. కొన్ని నెలలుగా అక్కడ వైరస్ తీవ్రత తగ్గినట్లు కనిపించినప్పటికీ మళ్లీ రెండో దఫా విజృంభణ మొదలయ్యింది.
దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో 58శాతం అత్యవసర వైద్యపడకలు కొవిడ్ రోగులతోనే నిండిపోతున్నట్లు ఫ్రాన్స్ వైద్యులు వెల్లడించారు. ఇది వైద్యులపై తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఫలితంగా జాతీయ స్థాయిలో మరోసారి లాక్‌డౌన్ విధించాలని సూచిస్తున్నారు.
"తొలి దఫా విజృంభణలో ఎదురైన సమస్యలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు, ఆ పరిస్థితి నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు" అని ఫ్రెంచ్ హాస్పిటల్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఫ్రెడెరిక్ వలెటౌక్స్ వెల్లడించారు.
ఈ దఫా విజృంభణ ఆసుపత్రి వ్యవస్థను మొత్తం నాశనం చేస్తుందనే ఆందోళన వ్యక్తంచేశారు. తీవ్ర చర్యలు తీసుకోకపోతే మళ్లీ ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడం, ఆసుపత్రుల నిర్వహణ అసాధ్యమని స్పష్టం చేశారు. అందుకే, పూర్తిగా మరో నెలపాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తేనే మంచిదని సూచిస్తున్నారు.
24గంటల్లో 523 మరణాలు..
దేశంలో వైరస్ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. కేవలం 24గంటల వ్యవధిలోనే 523మంది కరోనా మరణాలు సంభవించాయి. ఏప్రిల్ తర్వాత ఈ స్థాయిలో మరణాలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఫ్రాన్స్‌లో 12లక్షల 44వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా 35,582మంది మృత్యువాతపడ్డారు. బ్రిటన్, ఇటలీ తర్వాత ఇన్ని మరణాలు చోటుచేసుకున్న దేశాల్లో ఫ్రాన్స్ మూడో స్థానంలో ఉంది.
కరోనా తీవ్రతతో ఆసుపత్రులు నిండిపోవడం, మరణాల సంఖ్య మళ్లీ పెరగడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మేక్రాన్ అప్రమత్తమయ్యారు. వైరస్ తీవ్రతకు అడ్డుకట్ట వేసేందుకు పలు కీలక చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. లాక్‌డౌన్, కొవిడ్ నిబంధనలపై ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం మేక్రాన్ మరోసారి ప్రకటన చేయనున్నారు.
లాక్‌డౌన్ దిశగా అడుగులు..
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ విధించడంపై ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై వ్యాపార సంస్థలు, రాజకీయ నాయకులు లాక్‌డౌన్ అమలుచేయకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయనే వాదనలు కూడా ఉన్నాయి. కేవలం వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే లాక్‌డౌన్ విధించాలని వారు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తే మాత్రం దేశం ఆర్థికపరిస్థితి మరింత దిగజారుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఫ్రాన్స్ దారిలోనే ఇతర యూరప్ దేశాలు ఆర్థికంగా బలహీనపడతాయని సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మేక్రాన్ వైరస్ కట్టడి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.