బ్రిటన్ శాస్త్రవేత్తలు కీలక విషయాన్ని వెల్లడించారు. పెంపుడు జంతువులు కూడా కరోనా వైరస్ బారిన పడుతున్నాయని తెలిపారు.
ఉత్తర ఇటలీలో కొందరి ఇళ్లలోని 500 శునకాలు, పిల్లుల నమూనాలు సేకరించారు పరిశోధకులు. వాటికి కొవిడ్ పీసీర్ పరీక్షలు నిర్వహించారు. అన్నింటికీ నెగిటివ్ వచ్చింది. కానీ 3.4 శాతం శునకాలు, 3.9 శాతం పిల్లులలో కొవిడ్‌పై పోరాడే యాంటీ బాడీలు ఉత్పత్తి అయినట్లు లివర్‌పూల్ యూనివర్సిటీ సహా ఇతర శాస్త్రవేత్తలు గుర్తించారు.
కరోనా సోకిన వారి ఇళ్లలోని పెంపుడు జంతువులకే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం అధికంగా ఉందని పరిశోధకులు స్పష్టం చేశారు. వైరస్ లేని వారి ఇళ్లలోని జంతువుల్లో ఎలాంటి ఆనవాళ్లు లేవని చెప్పారు. ఈ అధ్యయనం ఇంకా పూర్తికాలేదు. పరిశోధనకు సంబంధించి ముందస్తు వివరాలు మాత్రమే ప్రచురితమయ్యాయి.
అయితే పెంపుడు జంతువుల నుంచి మనుషులకు కరోనా సోకుతుందని రుజువు చేసేలా ఎలాంటి ఆధారాలు ఇప్పటివరకు లభించలేదని తెలిపారు పరిశోధనలో పాల్గొన్న లివర్‌పూల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలన్ ర్యాడ్‌ఫోర్డ్. కొవిడ్ రోగుల నుంచి మాత్రం పెంపుడు జంతువులకు వైరస్ సోకుతుందని స్పష్టం చేశారు.