'ఐక్యరాజ్యసమితి ఆయుధ వాణిజ్య ఒప్పందానికి' అమెరికా మద్దతు ఉపసంహరించుకోవడంపై ఐరోపా సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ఆయుధాల వాణిజ్యాన్ని క్రమబద్ధీకరించే ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగితే, ఆయుధాల అక్రమ రవాణాను నిరోధించే పోరాటానికి విఘాతం ఏర్పడుతుందని తెలిపింది.
"ఐక్యరాజ్య సమితి ఆయుధ వాణిజ్య ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం.. ఆయుధాల అక్రమ రవాణాను నిరోధించే పోరాటానికి విఘాతం కలిగిస్తుంది. పారదర్శకంగా అంతర్జాతీయ ఆయుధాల వ్యాపారం నిర్వహించడానికి వీలుపడదు. అందుకే అన్ని దేశాలను, ముఖ్యంగా ప్రధాన ఆయుధ ఎగుమతి, దిగుమతిదారులను ఈ ఒప్పందంలో చేరాలని ఈయూ కోరుతోంది. యూరోపియన్ యూనియన్‌లోని 28 దేశాలు ఐక్యరాజ్యసమితి ఆయుధ వాణిజ్య ఒప్పందంలో చేరాయి. దాని లక్ష్యాలు సాధించడానికి, సార్వత్రిక ఆమోదం పొందడానికి, ఒప్పంద అమలుకు అవి కృషిచేస్తాయి."
- ఫెడెరికా మొఘేరిని, ఈయూ ప్రధాన దౌత్యవేత్త
అమెరికా సార్వభౌమత్వానికి విఘాతం
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ, అమెరికా సెనేట్ దీనిని ఇంతవరకూ ధ్రువీకరించలేదు. తాజాగా దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 'ఐక్యరాజ్యసమితి ఆయుధ వాణిజ్య ఒప్పందం' అమెరికా రాజ్యాంగంలోని రెండో సవరణకు వ్యతిరేకమని, అందుకే ఒబామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
2014 డిసెంబర్లో అంతర్జాతీయ ఆయుధాల వాణిజ్యాన్ని క్రమబద్ధీకరించే ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం సభ్యదేశాలు అంతర్జాతీయ ఆయుధ బదిలీలను నమోదు చేయాలి. ఈ ఒప్పందంలో మొదట 130 దేశాలు సంతకం చేశాయి. అందులో 101 దేశాలు ఒప్పందాన్ని ధ్రువీకరించాయి. ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ ఒప్పందంలో చేరగా, అతిపెద్ద ఆయుధ వ్యాపార దేశాలైన అమెరికా, రష్యా, చైనా ఈ ఒప్పందంలో చేరలేదు.
ఇదీ చూడండి: పాకిస్థాన్‌పై అగ్రరాజ్యం ఆంక్షలు