ఇరాన్లో ఉక్రెయిన్ విమానం నేలకూలడంపై స్వతంత్ర, విశ్వసనీయమైన విచారణ జరగాలని డిమాండ్ చేసింది ఐరోపా సమాఖ్య. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసిన ఇరాన్ పొరపాటున ఉక్రెయిన్ విమానాన్ని కూల్చిందని పలు నిఘా సంస్థలు అభిప్రాయ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వతంత్ర విచారణకు పట్టుబడుతోంది ఈయూ. అయితే ఇందుకు ఇరాన్ నిరాకరిస్తోంది.
ఇప్పటివరకు ఉక్రెయిన్ విమాన ఘటనకు కారణాలు తెలియరాలేదని వ్యాఖ్యానిస్తోంది ఐరోపా సమాఖ్య. విచారణకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు సమాఖ్య సిద్ధంగా ఉందని వెల్లడించారు ఈయూ అధికార ప్రతినిధి స్టెఫాన్ కీర్స్మైక్కర్.
"స్వతంత్ర, విశ్వసనీయ సంస్థతో ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి. అంతర్జాతీయ పౌరవిమానయాన నిబంధనల మేరకు విచారణ ఉండాలి."
-స్టెఫాన్. డి. కీర్స్మైక్కర్, ఐరోపా సమాఖ్య అధికార ప్రతినిధి
'అవకాశాలున్నాయి'
క్షిపణి దాడుల్లో తమ విమానం కూలిందన్న వార్తలను కొట్టిపారేయలేమన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ. అయితే ఇది నిజమేనని నిర్ధరణ కాలేదని వ్యాఖ్యానించారు. అమెరికా, బ్రిటన్, కెనడాలు విచారణ కమిటీ ముందు ఆధారాలు చూపాలని తెలిపారు.
"మేం మా ప్రతినిధులతో నిరంతరం చర్చిస్తూనే ఉన్నాం. క్షిపణి దాడుల్లో విమానం కూలిందన్న వార్తలను కొట్టిపారేయలేం. అయితే ఇప్పటివరకు దానిని నిర్ధరించలేదు."
-వ్లాదిమిర్ జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు
ఇదీ చూడండి: కయ్యాలమారి మలేసియాకు మోదీ 'పామాయిల్' పంచ్