Doctor Simon Bramhall: ఓ వ్యక్తికి కాలేయ మార్పిడి చేసిన డాక్టర్.. తన వృత్తికే అవమానకరమైన పని చేశాడు. తన పేరులోని మొదటి అక్షరాలతో ఆ లివర్‌పై సంతకంలా చేశాడు. నిందితుడైన యూకేకు చెందిన వైద్యుడు సైమన్ బ్రామ్‌హాల్ పేరును.. మెడికల్ రిజిస్టర్ నుంచి తొలగించింది మెడికల్ ప్రాక్టీషనర్స్ ట్రైబ్యునల్ సర్వీస్- ఎంపీటీఎస్. వైద్య వృత్తి నుంచి శాశ్వతంగా తప్పించింది.
సైమన్ శస్త్రచికిత్స చేసిన బాధితుడు.. కొద్దిరోజులకే మరోసారి ఆస్పత్రికి వెళ్లగా ఈ విషయం బయటపడింది. అతడి లివర్‌పై 1.6 అంగుళాల సైజులో అక్షరాలను గుర్తించాడు మరో వైద్యుడు. ఆ బాధితుడికి మొదట చేసిన కాలేయ మార్పిడి కూడా విఫలమైనట్లు అప్పుడే తెలిసింది.
2013 ఫిబ్రవరి, ఆగస్టులో.. ఇలా రెండుసార్లు కాలేయ మార్పిడి చేసిన సమయంలో వాటిపై తన ఇనీషియల్స్ను రాసినట్లు సైమన్ చెప్పాడు. 2017లో తన నేరాన్ని అంగీకరించాడు. ఇందుకోసం ఆర్గాన్ బీమ్ మెషీన్‌ను ఉపయోగించినట్లు వివరించాడు.
విషయం బయటకు తెలిసిన అనంతరం.. సైమన్ 2013లోనే కన్సల్టెంట్ సర్జన్ పోస్ట్ నుంచి సస్పెండ్ అయ్యాడు. విచారణ సమయంలోనే 2014లో బర్మింగ్‌హామ్ క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్లో తన పదవికి రాజీనామా చేశాడు.
Medical Practitioners Tribunal Service: రెండు కేసుల్లో సైమన్ మొత్తం 13,619 డాలర్లు (రూ. 10 లక్షలకుపైనే) జరిమానా కట్టాలని, సమాజ సేవ చేయాలని ఆదేశించింది ట్రైబ్యునల్.
2020 డిసెంబర్లో మరోసారి కేసును సమీక్షించి.. మెడికల్ ప్రాక్టీస్ చేయకుండా 5 నెలలు సస్పెన్షన్ విధించింది ఎంపీటీఎస్. కానీ అతని సత్ప్రవర్తన కారణంగా.. 2021 జూన్‌లో అతడిపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.
సస్పెన్షన్‌పై ట్రైబ్యునల్ నిర్ణయాన్ని తప్పుబట్టిన హైకోర్టు జడ్జి.. నిందితుడిని వైద్య వృత్తి నుంచి తొలగించడమే సముచితమైనదని, అదే అతడికి శిక్ష అని స్పష్టం చేశారు.
సైమన్ 'ఆటోగ్రాఫ్' వల్ల రోగికి ఎలాంటి శారీరక నష్టం జరగకపోయినా.. మానసికంగా ఎప్పటికీ వేధిస్తుందని సోమవారం జరిపిన విచారణలో మెడికల్ ట్రైబ్యునల్ కూడా పేర్కొంది. వైద్య వృత్తి నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు తాజా తీర్పులో వెల్లడించింది.
28 రోజుల్లోగా దీనిపై అప్పీల్ చేసుకునే అవకాశం సైమన్ బ్రామ్హాల్కు ఉంది.
ఇవీ చూడండి: మెడికల్ మిరాకిల్.. మనిషికి పంది గుండె అమర్చిన వైద్యులు