అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహకారం అందించకుండా.. వాతావరణ మార్పుల నివారణపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi G20 Summit) ఉద్ఘాటించారు. క్లైమెట్ ఫైనాన్స్ విషయంలో నిర్లక్ష్యాన్ని భారత్ విస్మరించలేదని (Modi news) అన్నారు. హరిత ప్రాజెక్టుల కోసం సంపన్న దేశాలు తమ జీడీపీలో ఒక శాతం నిధులను అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని (PM Modi news) పిలుపునిచ్చారు.
జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా నిర్వహించిన 'వాతావరణ మార్పులు, పర్యావరణం' అంశంపై ప్రసంగించిన (Modi G20 Summit) ఆయన.. వాతావరణ ధర్మాన్ని విస్మరించి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అన్యాయం చేయడమే కాకుండా.. మానవాళి అంతటినీ మోసం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అభివృద్ధి చెందిన దేశాలకు (Modi G20 speech) మూడు కీలక సూచనలు చేశారు.
"అభివృద్ధి చెందుతున్న దేశాల తరపున గళం వినిపించే భారత్.. వాతావరణ ఆర్థిక సహకారంలో జరుగుతున్న నిర్లక్ష్యంపై మౌనంగా ఉండలేదు. క్లైమెట్ ఫైనాన్స్‌పై ఎలాంటి పురోగతి లేకుండా.. వాతావరణ మార్పుల విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఒత్తిడి తీసుకురావడం న్యాయం కాదు. జీ20 దేశాలు పరిశుద్ధ ఇంధన ప్రాజెక్టుల నిధిని ఏర్పాటు చేసి.. పేద దేశాల కోసం వినియోగించాలి. శుద్ధ ఇంధన పరిశోధనా సంస్థల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలి. హరిత ఉదజని రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు నెలకొల్పేందుకు జీ20 దేశాలు ఓ సంస్థను నెలకొల్పాలి. తద్వారా హరిత ఉదజని ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించవచ్చు. ఈ ప్రయత్నాలకు భారత్ పూర్తిగా సహకారం అందిస్తుంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
పారిస్ లక్ష్యాలను మించి...
వాతావరణ మార్పుల లక్ష్యాలను అందుకునే విషయంలో భారత్ వేగంగా ముందుకు సాగుతోందని మోదీ (Modi G20 speech) వ్యాఖ్యానించారు. పునరుత్పాదక ఇంధనాల విషయంలో భారత్.. పారిస్ ఒప్పంద లక్ష్యాలను అధిగమించడమే కాకుండా.. ఉన్నత లక్ష్యాలను నిర్దేశిస్తోందని చెప్పారు. పారిస్ ఒప్పందంలో లేని అంశాలపైనా భారత్ పనిచేస్తోందని (Modi G20 speech) వివరించారు. 26 మిలియన్ హెక్టార్ల బంజరు భూమిలో పునరావాస చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన భారతీయ రైల్వే.. 2030 నాటికి కర్బన రహితంగా మారాలని లక్షించుకుందని తెలిపారు. భారతీయ రైల్వే నిర్ణయంతో ఏటా 60 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని వెల్లడించారు. 2025 నాటికి 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
"వాతావరణ మార్పుల కట్టడి విషయంలో భారత్ ఎన్నడూ వెనకడుగు వేయలేదు.. భవిష్యత్‌లో వేయదు కూడా. గత కొద్ది సంవత్సరాలలో చేపట్టిన చర్యల వల్ల.. పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కలిగిన దేశాల్లో భారత్ తొలి ఐదు స్థానాల్లో నిలిచింది. భారత్ సాధించిన విజయాన్ని ప్రపంచం గుర్తిస్తోంది. ఆసియా సింహాలు, పులులు, ఖడ్గమృగాలు, డాల్ఫిన్ల సంఖ్యను భారత్ గణనీయంగా పెంచింది. పర్యావరణ పరిరక్షణ అంటే ఇంధన వినియోగానికే పరిమితం కాదని భారత్ నిరూపిస్తోంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
సుస్థిరాభివృద్ధి అంశంపై జరిగిన మరో సమావేశంలోనూ మాట్లాడారు (Modi G20 speech) ప్రధాని. కరోనా వల్ల సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన నెమ్మదించిందని అన్నారు. మహమ్మారి వల్ల ఆర్థిక, సామాజిక, లింగపరమైన అవాంతరాలు మరింత పెరిగాయని చెప్పారు. కొవిడ్ అనంతరం సుస్థిరాభివృద్ధి, తక్కువ అభివృద్ధి చెందిన దేశాలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని అన్నారు.
'జీ20 ఫలప్రదం'
జీ20 సమావేశాలు ఫలప్రదంగా సాగాయని మోదీ పేర్కొన్నారు. సదస్సు ముగిసిన అనంతరం ట్వీట్ చేసిన మోదీ.. ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన సమస్యలపై చర్చించే అవకాశం లభించిందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ఆవిష్కరణలు, కరోనా మహమ్మారి, వైద్య మౌలిక వసతులను మెరుగుపర్చే అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ బలోపేతం చేయాలని జీ20 నేతలు అవగాహనకు వచ్చినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇంధనం, పర్యావరణ అంశాలపై ప్రధానంగా చర్చలు జరిగినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: