కొవిడ్ నివారణకు వినియోగించే ఆస్ట్రాజెనెకా టీకా వినియోగాన్ని ఐరోపా సమాఖ్యలోని చాలా దేశాలు నిలిపివేశాయి. ఆ కంపెనీ టీకాల్లోని ఓ బ్యాచ్‌లో తయారైన వాటిలో కొన్ని సమస్యలను గుర్తించడం వల్ల వినియోగాన్ని తాత్కాలికంగా ఆపేశాయి. ఆస్ట్రియాలోని 49ఏళ్ల నర్సు ఆస్ట్రాజెనెకా టీకా తీసుకొన్న కొన్ని రోజుల్లోనే ఆమె రక్తంలో సమస్యలు ఎదురయ్యాయి. ఆ తర్వాత ఆమె కన్నుమూసింది. దీంతో ఆస్ట్రియాలో ఈ టీకా వినియోగాన్ని నిలిపేశారు. గురువారం డెన్మార్క్ ఆరోగ్యశాఖ రెండు వారాలపాటు ఆస్ట్రాజెనెకా టీకా వినియోగాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత నార్వే కూడా దీని వినియోగంపై సస్పెన్షన్ విధించింది. మరోపక్క ఎస్తోనియా, లత్వియా, లుత్వేనియా, లక్సంబర్గ్‌లు టీకాల్లోని ఓ బ్యాచ్‌కి చెందిన వాటిని వాడటం ఆపేశాయి.
సమస్య ఏమిటీ..
ఆస్ట్రాజెనెకాకు చెందిన ABV5300 బ్యాచ్ నంబర్లో తయారైనా టీకాను తీసుకొన్న ఆస్ట్రియా నర్సుకు శరీరంలో రక్తం చాలా చోట్ల గడ్డకట్టింది. ఆ తర్వాత ఆమె మరణించింది. ఆ తర్వాత చాలా దేశాల్లో ఈ బ్యాచ్ టీకా తీసుకొన్న వారిలో సమస్యలు ఎదురయ్యాయి. వీటికి కచ్చితంగా వ్యాక్సినే కారణమని యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ చెప్పలేకపోతోంది.
ABV5300 నంబర్ బ్యాచ్‌కు చెందిన 10లక్షల టీకాలను 17 దేశాలకు సరఫరా చేసినట్లు తేలింది. వీటిలో ఆస్ట్రియా, బల్గేరియా, సైప్రస్, డెన్మార్క్, ఎస్తోనియా, ఫ్రాన్స్, గ్రీస్, ఐస్‌ల్యాండ్, ఐర్లాండ్, లత్వియా, లుత్వేనియా, లక్సంబర్గ్, మాల్టా, ది నెదర్లాండ్స్, పోలాండ్, స్పెయిన్, స్వీడన్ దేశాలు ఉన్నాయి. టీకాలో సమస్యల అంశాన్ని ఈఎంఏకు చెందిన పీఆర్‌ఏసీ బృందం పరిశీలిస్తోంది.
ఇదీ చూడండి:'టీకా దాచుకుంటున్నారు.. అది తప్పుడు చర్య'