Covid Virus Loses Ability: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల్లో బీభత్సం సృష్టిస్తోంది. కొద్దిరోజులుగా భారత్‌లోనూ లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే వైరస్ గాల్లో ఎంతసేపు ప్రభావవంతంగా ఉంటోందనే అంశంపై జరిపిన ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. వైరస్ 20 నిమిషాలపాటు గాల్లో ఉంటే దాని సామర్థ్యం 90 శాతం క్షీణిస్తున్నట్లు తాజాగా వెల్లడైంది. గాల్లో ఉన్న మొదటి ఐదు నిమిషాల్లోనే అధికశాతం సంక్రమణ శక్తికి కోల్పోతున్నట్లు యూకేలోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఏరోసోల్ రీసెర్చ్ సెంటర్ ప్రచురించిన ఓ అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనాన్ని ఇంకా పూర్తిస్థాయిలో సమీక్షించలేదు.
కొవిడ్ వ్యాప్తి కట్టడికి మాస్కుల వాడకం ప్రాముఖ్యతను శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. భౌతికదూరం పాటించాలని సూచించారు. మాస్కులు ధరించడం, దూరాన్ని పాటించడం వల్ల కొవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చన్నారు. 'వెంటిలేషన్ సరిగా లేని ప్రదేశాల్లో వైరస్ అధికంగా సంక్రమిస్తుందని, చాలా మంది ఈ అంశంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. కానీ, ప్రజలు దగ్గరగా ఉంటేనే వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉంటుంది.' అని ఈ అధ్యయంలో పాలుపంచుకున్న ప్రొఫెసర్ జొనాథన్ రీడ్ ఓ వార్తాసంస్థకు తెలిపారు.
ఇదిలా ఉంటే.. అత్యంత వ్యాప్తి కలిగిన కొత్త వేరియంట్ ఓమిక్రాన్‌పై దక్షిణాఫ్రికాలో నిర్వహించిన రెండు పరిశోధనలు కీలక అంశాలను వెల్లడించాయి. మిగిలిన వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌లో లక్షణాలు లేని వ్యక్తులు అత్యధికంగా ఉన్నారని ఈ పరిశోధనలు తేల్చాయి. వీరు వాహకులుగా మారి వ్యాప్తిని మరింత రాజేస్తున్నట్లు తేలింది. ఉబుంటు, సిసోంకే పేర్లతో నిర్వహించిన పరిశోధనల్లో ఈ అంశం బహిర్గతమైంది.
OMICRON CASES MAY BE HEADED FOR A RAPID DROP
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచదేశాలను పట్టిపీడిస్తోంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో కేసులు రోజురోజుకూ రెట్టింపవుతూ లక్షల మందికి సోకింది. అయితే ఈ అంటువ్యాధి బ్రిటన్‌లో ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరుకొని ఉంటుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. అమెరికాలోనూ ఇదే తరహాలో కేసులు ఒక్కసారిగా కిందకు దిగివస్తాయని చెబుతున్నారు.
Corona Pandemic End: ఇదే సమయంలో కరోనా మహమ్మారి తదుపరి దశ ఎలా ఉంటుందనేదానిపై ఇంకా అనిశ్చితి నెలకొందని నిపుణులు వెల్లడించారు. రానున్న 2-3 వారాలు క్రూరంగా ఉండబోతోందని, కేసుల సంఖ్య విపరీతంగా పెరిగి.. ఐసీయూల్లో చేరే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
ఇవీ చూడండి: Anthony Fauci: 'కరోనాను అంతం చేయడం అసాధ్యం'
'భారీగా తగ్గనున్న ఒమిక్రాన్ కేసులు- కారణం ఇదే..!'