ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా టీకాగా అభివర్ణిస్తూ రష్యా విడుదల చేసిన 'స్పుత్నిక్-వీ' వల్ల ఇన్ఫెక్షన్లు తలెత్తుతున్నాయి. వ్యాక్సిన్ తయారీలో పాల్గొన్న ఉన్నతాధికారి ఈ విషయాన్ని వెల్లడించారని ఆ దేశ వార్తా సంస్థ 'టాస్' తెలిపింది. ఈ నేపథ్యంలో ట్రయల్స్‌లో పాల్గొన్న వలంటీర్లలో ఎవరికి అసలైన వ్యాక్సిన్ ఇచ్చామనే విషయంపై గమలేయ సంస్థ సమాచారం క్రోడీకరిస్తోందని వెల్లడించింది.
"టీకాకు అనుమతులు లభించిన తర్వాత నిర్వహించిన పరీక్షల్లో కొందరికి ఇన్ఫెక్షన్లు తలెత్తాయి. నవంబర్ మధ్యలో తాత్కాలిక ఫలితాలు వెల్లడవుతాయి. ప్లాసిబో, నమూనా పరీక్షల మధ్య వ్యత్యాసం అప్పుడు స్పష్టమవుతుంది."
-రష్యా అధికారి.
ట్రయల్స్ ఫలితాలు వెల్లడైన తర్వాత ఎవరు ప్లాసిబో తీసుకున్నారు, ఎవరు టీకా తీసుకున్నారనే విషయం తెలుస్తుందని గమలేయ జాతీయ పరిశోధన కేంద్రం డిప్యూటీ రీసెర్చి డైరెక్టర్ డెనిస్ లొగునవ్ పేర్కొన్నారు.
మరోవైపు, టీకా కాకుండా ప్లాసిబో తీసుకున్నవారిలోనే ఈ లక్షణాలు కనిపించి ఉంటాయని గమలేయ సంస్థ డైరెక్టర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.