కరోనా వైరస్ కారణంగా తొలినాళ్లలో విధించిన దేశవ్యాప్త లాక్డౌన్లు, ప్రజారోగ్య కార్యక్రమాల నిర్వహణ వల్ల ప్రాణాంతక బ్యాక్టీరియా వ్యాప్తికి అడ్డుకట్టపడిందని 'ది లాన్సెట్ డిజిటల్ హెల్త్' కథనం ప్రచురించింది. ఒకవేళ ఈ బ్యాక్టీరియా వ్యాపించి ఉంటే.. శ్వాసకోశ ఇబ్బందులు విపరీతంగా పెరిగి ఉండేవని తాజా అధ్యయనంలో వెల్లడైనట్లు స్పష్టం చేసింది.
ప్రాణాంతక బ్యాక్టీరియా వల్ల.. వృద్ధులు, పిల్లల్లో నిమోనియా, మెనింజిటిస్(వెన్నుపూస, మెదడుకు హాని చేసే రోగం), సెప్సిస్ వంటి రోగాలు విపరీతంగా పెరిగేవని అధ్యయనంలో తేలింది. ఇవి ఒకరినుంచి మరొకరికి వేగంగా వ్యాపించి ఉండేవని వెల్లడైంది.
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ నిపుణులు చేసిన ఈ అధ్యయనంలో.. 2020 జనవరి- మే మధ్య కాలంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు చాలా మేరకు తగ్గినట్లు స్పష్టమైంది. అయితే.. ఇది లాక్డౌన్ల వల్లే సాధ్యమైనట్లు నిపుణులు భావిస్తున్నారు.
కొవిడ్ నిబంధనల నేపథ్యంలో నాలుగు వారాల వ్యవధిలో స్ట్రెప్టోకొక్కస్ నిమోనియా బాధితుల సంఖ్య 68 శాతం తగ్గగా.. 8 వారాల్లో ఇది 82 శాతం తగ్గింది. "ఈ ఫలితాలు చూస్తే.. కొవిడ్ నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనల కారణంగా శ్వాసకోశ సమస్యలను అడ్డుకోగలిగినట్టు స్పష్టమవుతుంది. కానీ.. లాక్డౌన్ల వల్ల సమాజంపై తీవ్ర ఒత్తిడి పెరిగిన మాట కూడా విదితమే" అని ప్రొఫెసర్ ఏంజెలా బ్రూగెమన్ అభిప్రాయపడ్డారు. అయితే.. ఇలాంటి ప్రాణాంతక బ్యాక్టీరియా వ్యాప్తి జరగకుండా తగిన చర్యలు తీసుకోవడం అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి:అమెరికా టీకాలు భారత్కు రావా?