అన్ని దేశాలకు టీకా పంపిణీ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన కొవాక్స్ వద్ద 2 బిలియన్ వ్యాక్సిన్ డోసులు సరఫరా చేసేందుకు ఒప్పందాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 42 దేశాలు టీకా తయారు చేస్తున్నాయని చెప్పారు. వీటిలో 36 ధనిక దేశాలు కాగా, మిగిలిన ఆరు మధ్య ఆదాయ దేశాలు అని తెలిపారు.
అయితే ప్రపంచంలోని పేద దేశాల పరిస్థితి దయనీయంగా ఉందని టెడ్రోస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దేశాలకు టీకా అందుబాటులోకి రావడానికి సమయం పట్టేలా ఉందన్నారు. ప్రపంచంలోని ధనిక దేశాలు అవసరానికి మించి టీకాల ఒప్పందాలు కుదుర్చుకోకుండా, పేద దేశాలకు టీకాలు సరఫరా చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని ధనిక దేశాలు రెండు టీకా సంస్థలతోనూ ఒప్పందాలు కుదర్చుకుంటున్నాయని చెప్పారు.
కొవ్యాక్స్ వ్యయంతో ధనిక దేశాలు, టీకా సంస్థలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవడం మానేయాలని టెడ్రోస్ సూచించారు.
పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రపంచంలోని అన్ని దేశాలకు టీకా పంపిణీ చేసేందుకు కొవాక్స్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసింది.