కరోనా వైరస్ మహమ్మారితో బాధపడుతున్న ప్రపంచానికి కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు మరో షాకింగ్ వార్త చెప్పారు! కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు శరీరంలో తయారైన రోగనిరోధక శక్తి కొన్ని నెలల్లోనే మాయం అవుతోందట. ప్రభుత్వాలు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.
కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు 90 మంది కొవిడ్-19 బాధితుల్లో యాంటీబాడీల స్థాయిలను అధ్యయనం చేశారు. కాలం గడిచే కొద్దీ అవి ఎలా మార్పు చెందుతున్నాయో పరిశీలించారు. స్వల్ప, మోతాదు లక్షణాలు ఉన్నవారి రోగనిరోధక వ్యవస్థ కొంతే స్పందించిందని రక్తపరీక్షల్లో గమనించారు. వ్యాధి సోకిన కొన్ని వారాల తర్వాత 60శాతం మందిలో చెప్పుకోదగ్గ స్థాయిలో వైరస్‌కు స్పందన కనిపించింది. మూడు నెలల తర్వాత మాత్రం 16.7శాతం మందిలోనే అత్యధిక స్థాయిలో కొవిడ్-19 తటస్థీకరణ యాంటీబాడీలు కనిపించాయి. 90 రోజుల తర్వాత చాలామంది రోగుల రక్తప్రవాహంలో అసలు గుర్తించదగ్గ స్థాయిలో యాంటీబాడీలే కనిపించలేదు.
సాధారణంగా ఏదైనా ఒక కొత్త వైరస్‌గానీ ఇతర మైక్రో బయాల్స్ గానీ ప్రవేశిస్తే మన శరీరం వెంటనే ప్రతిస్పందిస్తుంది. దానిని సంహరించేందుకు ప్రతిస్పందనగా యాంటీజెన్ రూపంలో ప్రొటీన్లను విడుదల చేస్తుంది. ఈ యాంటీబాడీలు రోగకారక వైరస్‌పై పోరాడి తిరిగి ఆరోగ్యం చేకూరుస్తాయి. సాధారణంగా ఒకసారి యాంటీబాడీలు విడుదల అయ్యాయంటే ఎప్పటికీ అవి శరీరంలోనే ఉండిపోతాయి.
కొవిడ్-19 విషయంలో ఇలా జరగడం లేదని శాస్ర్తవేత్తలు అంటున్నారు. కొన్ని నెలల వరకే యాంటీబాడీలు శరీరంలో కనిపిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. ఇకపై యాంటీబాడీ టెస్టుల్లో పాజిటివ్ వచ్చినంత మాత్రాన తామిక సురక్షితమని భావించొద్దని హెచ్చరిస్తున్నారు. ఎప్పటిలాగే భౌతికదూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ మాస్క్‌లు ధరించాలని స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా 1.30కోట్లు దాటిన కరోనా కేసులు