ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కరోనా వైరస్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. సరిహద్దుల మూసివేతతో వైరస్ త్వరితంగా వ్యాప్తి చెందుతుందని వ్యాఖ్యానించింది. అధికారిక సరిహద్దులు మూసేస్తే వ్యాధి లక్షణాలున్న వారు అనధికారిక మార్గాలను ఎంచుకునే అవకాశం ఉందని తద్వారా వ్యాధి ఎక్కడ వ్యాపించేది గుర్తించలేమని తెలిపింది.
గురువారం అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అయితే ఎటువంటి అంతర్జాతీయ వాణిజ్యం, ప్రయాణాలపైనా నిషేధం వంటివి విధించలేదు. ఇటువంటి విధానాలు అవలంబిస్తున్న దేశాలు పునరాలోచించుకోవాలని ఉద్ఘాటించింది.
అయితే కరోనా కారణంగా ఇప్పటికే 2వందలమందికిపైగా మృతి చెందడం, 20 దేశాలకు వ్యాపించిన నేపథ్యంలో ఆయా దేశాలు భయాందోళనలకు లోనవుతున్నాయి. చైనా నుంచి యాత్రికులను అనుమతించడం లేదు. దీనిపైనే స్పందించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ నిర్ణయంతో వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేర్కొంది.
కరోనాపై ఉద్యమిస్తాం: ఫేస్బుక్
కరోనా వైరస్‌కు సంబంధించి అందరికీ ఉపయోగకరమైన సమాచారాన్ని వ్యాప్తి చేస్తామని ప్రకటించింది సామాజిక మాధ్యమం ఫేస్బుక్. తప్పుడు, భయాందోళనలను వ్యాప్తి చేసే సమాచారాన్ని నియంత్రించేందుకు కృషి చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఫేస్బుక్ ఆరోగ్య విభాగం ఉన్నతాధికారి కాంగ్ జింగ్ జిన్ ప్రకటన విడుదల చేశారు. ఫ్యాక్ట్ చెకర్స్ ద్వారా సమాచారాన్ని సమీక్షించి తప్పుడు సమాచారాన్ని నియంత్రిస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి: కరోనాపై అతి చేయకండి: ప్రపంచ దేశాలకు చైనా 'క్లాస్'