ప్రతిష్టాత్మక పర్యావరణ పురస్కారాన్ని స్వీకరించడానికి స్వీడన్ పర్యావరణవేత్త గ్రెటా థెన్‌బెర్గ్ నిరాకరించారు. అధికారంలో ఉన్న ఉన్నవారు సైన్స్ గురించి వినాలని, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని కోరారు. ఇందుకు అవార్డులు ప్రకటించడం మాత్రమే సరిపోదని 16 ఏళ్ల థెన్‌బెర్గ్ స్పష్టం చేశారు.
నార్డిక్(ఉత్తర ఐరోపా, ఉత్తర అట్లాంటిక్ మధ్య ఉన్న ప్రాంతం) దేశాల పార్లమెంటుల మధ్య సహకారం కోసం ఏర్పాటైన నార్డిక్ కౌన్సిల్... స్టాక్‌హోంలో గ్రెటా థెన్బెర్గ్ను సత్కరించింది. 'ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్' ఉద్యమం ద్వారా లక్షలాది మంది యువతను పర్యావరణ పరిరక్షణ కోసం కదిలివచ్చేలా చేసినందుకు ఈ కార్యక్రమం ఏర్పాటుచేసింది.
అవార్డు నాకొద్దు..
నార్డిక్ కౌన్సిల్ అవార్డుకు థెన్బెర్గ్ను స్వీడన్, నార్వే నామినేట్ చేశాయి. చివరకు పర్యావరణ బహుమతిని గెలుచుకున్నారు. అయితే 350,000 డానిష్ క్రోనార్ (సుమారు 52 వేల డాలర్లు) విలువైన ఈ బహుమతిని థెన్‌బెర్గ్ స్వీకరించరని ఆమె ప్రతినిధి ప్రకటించారు. ఇదే విషయాన్ని థెన్‌బెర్గ్ తన ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా ధ్రువీకరించారు.
"పర్యావరణ ఉద్యమానికి అవార్డులు అవసరంలేదు."
- థెన్‌బెర్గ్, పర్యావరణవేత్త
నార్డిక్ దేశాలు వాతావరణ సమస్యలపై సరిగ్గా స్పందించడం లేదని థెన్‌బెర్గ్ విమర్శించారు. పర్యావరణ పరిరక్షణకోసం చర్యలు చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆమె అసంతృప్తి వ్యక్తంచేశారు.
ఇదీ చూడండి: ఐరాసలోని భారత బృందంతో ఐరోపా ఎంపీల భేటీ