ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏసుక్రీస్తు జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ప్రజలు. క్రైస్తవులు అర్ధరాత్రి నుంచే ప్రభువును స్మరించుకుంటూ చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు.
పోప్ ఫ్రాన్సిస్ సందేశం..
ప్రపంచంలోనే అతిపెద్ద చర్చి అయిన వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలియాలో క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ప్రపంచానికి శాంతి సందేశం అందించారు. క్రీస్తు అందించే ఆప్యాయత, కరుణ అందరిపైనా సమానంగా ఉంటుందని ఉద్బోధించారు. జీసస్ చూపించే అపార ప్రేమతో తమని తాము మార్చుకోవాలే తప్ప ఇతరులను మార్చడానికి ప్రయత్నించకూడదని వ్యాఖ్యానించారు.
పవిత్రస్థలంలో ప్రార్థనలు..
క్రైస్తవులకు పవిత్ర స్థలమైన బెత్లహాంలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. జీసస్ జన్మించిన ప్రదేశంగా భావించే చర్చ్ ఆఫ్ నేటివిటీలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ఈ చర్చికి పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ సైతం హాజరయ్యారు.
వేడుకలకు దూరంగా నోటర్ డేమ్ కాథెడ్రల్
ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత నోటర్ డేమ్ కాథెడ్రల్ చర్చిలో 200 ఏళ్ల తర్వాత తొలిసారి క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించలేదు. ఫ్రెంచి విప్లవం తర్వాత క్రిస్మస్ వేడుకలు నిర్వహించకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఏప్రిల్ నెలలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో చర్చి ధ్వంసమైంది. సందర్శకులను లోపలికి అనుమతించేందుకు చర్చి అనుకూలంగా లేనందున ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను నిర్వహించలేకపోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో సమీపంలోని మరో చర్చిలో ప్రార్థనలు చేశారు. అగ్ని ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన 14వ శతాబ్దం నాటి కళాఖండం అయిన లేడీ ఆఫ్ పారిస్‌ను ఇదే చర్చిలో ఏర్పాటు చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో చర్చి చాలా వరకు ధ్వంసమైంది. యునెస్కో వారసత్వ సంపదలో చోటు సంపాదించిన ఈ నిర్మాణం పైకప్పు పూర్తిగా కాలిపోయింది. చర్చి నిర్మాణాన్ని 1163 సంవత్సరంలో ప్రారంభించినట్లు సమాచారం. ధ్వంసమైన చర్చి పునర్నిర్మాణానికి చాలా ఏళ్లు పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: 'ఐపీఎల్ ద్వారా ఆసీస్ ఆటగాళ్లకు లాభమే'