కరోనా పుట్టినిల్లు చైనాలో యూకే స్ట్రెయిన్ తొలి కేసు నమోదైంది. బ్రిటన్‌లో కరోనా కొత్తగా రూపాంతరం చెంది వివిధ దేశాలకు వ్యాపిస్తోన్న విషయం విధితమే. ఈ మేరకు బ్రిటన్ నుంచి చైనాకు వచ్చిన మహిళకు కొత్తరకం కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. యూకే కరోనా స్ట్రెయిన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని నిపుణులు చెబుతున్నారు. దీనితో ఇప్పటికే 50 కి పైగా దేశాలు యూకే నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. బ్రిటన్‌తో అనుసంధానమైన విమానాలను కూడా రద్దు చేశాయి.
డిసెంబర్ 14న షాంఘైకి వచ్చిన 23 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ వచ్చిందని బుధవారం చైనా వ్యాధి నియంత్రణ కేంద్రం తెలిపింది. ఆ మహిళ సాధారణ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరింది. డిసెంబర్ 24న ఆమె నుంచి జన్యు శాంపిల్స్ తీసుకొని పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. యూకే నుంచి వచ్చిన అనంతరం ఆమె షాంఘై, వుహాన్‌లలో తిరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనితో ఆమెను కలిసినవారి వివరాలను ట్రాక్ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. బ్రిటన్‌తో విమాన రాకపోకలను చైనా డిసెంబర్ 24 నుంచి రద్దు చేసింది.
ఫ్రాన్స్‌లో దక్షిణాఫ్రికా కరోనా కేసు..
దక్షిణాఫ్రికాలో రూపాంతరం చెందిన కొత్త రంకం కరోనా వైరస్ కేసులు ఇతర దేశాల్లోనూ నమోదవుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌లో దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ కొవిడ్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఫ్రాన్ ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది.
ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో కొత్త స్ట్రెయిన్ కరోనా లక్షణాలు గుర్తించినట్లు ఫ్రాన్స్ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా కొత్త స్ట్రెయిన్ కేసులు స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, జపాన్, బ్రిటన్లలో వెలుగు చూశాయి.
ఇదీ చూడండి:'చైనా టీకా' వినియోగానికి షరతులతో అనుమతి