కరోనా వైరస్‌తో అత్యధికంగా ప్రభావానికి గురైన దేశాల్లో ఇటలీ ఒకటి. కరోనా సంక్షోభంతో అక్కడ అన్ని వ్యాపార కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఇటలీ ఉంబ్రియాలో 200 ఏళ్లుగా మగ్గంతో నేచిన వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది. అయితే కరోనా కారణంగా వస్త్ర పరిశ్రమపైనా నీలినీడలు కమ్ముకోవడం వల్ల అక్కడి పరిశ్రమ డీలా పడింది. కొవిడ్ వ్యాప్తి కారణంగా మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఉంబ్రియాలో నేత పరిశ్రమ సరికొత్త మార్గాన్ని ఎంచుకుని రాణిస్తోంది. 20శతాబ్దంలో ప్రారంభమైన తేలా అంబ్రా వర్క్‌షాప్ ప్రస్తుతం మాస్కులను తయారు చేస్తోంది. బంగారపు దారం, నూలుతో కలిపిన సున్నితమైన, ప్రభావవంతమైన వస్త్రాలను నేసి వాటితో మాస్క్‌ను తయారు చేస్తోంది.
పురాతన చరిత్ర
ఆరుగురు మహిళల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ వస్త్రదుకాణానికి పురాతన చరిత్ర ఉంది. సంప్రదాయ వస్త్రాలను ఇక్కడ మగ్గాలపై నేస్తారు. సిట్టా డి కాస్టెల్లోలోని తేలా అంబ్రా వర్క్‌షాప్ నిర్వహకులు కరోనాపై పోరులో భాగస్వామ్యం అయ్యేందుకు ఏప్రిల్‌లో ఆసుపత్రి సిబ్బందికి ఉచితంగా మాస్క్‌లను తయారు చేసి ఇచ్చారు. అదే సమయంలో వారికి ఖరీదైన మాస్కులు ఎందుకు తయారు చేయకూడదనే ఆలోచన వచ్చింది. వెంటనే బంగారపుదారంతో కలిపిన వస్త్రాలు నేసి వాటితో ఖరీదైన మాస్కులు తయరీ మొదలు పెట్టారు.
మిలమిల మెరుస్తూ..
ఇలా ఖరీదైన మాస్కులు తయారు చేయడానికి రోజుల సమయం పడుతుందని నిర్వహకులు పేర్కొన్నారు. ఒక మీటర్ బంగారపు వస్త్రం తయారు చేయడానికి 8గంటలు పడుతుందని చెప్పారు. అలా తయారు చేసిన మాస్క్ మిలమిలా మెరిసిపోతూ ఒక్కోటి 25 యూరోలకు అమ్ముడుపోతోంది. ప్రస్తుతం జర్మనీ, స్విట్జర్లాండ్, స్పెయిన్ సహా పలు దేశాల నుంచి బంగారపు వస్త్రం మాస్క్‌లకు ఆర్డర్‌లు వస్తున్నట్లు నిర్వాహులు చెప్పారు.
14, 15వ శతాబ్దంలో ఇటలీలో ఎక్కువగా సంప్రదాయ వస్త్రాల తయారీ కొనసాగింది. తేలా అంబ్రా వస్త్ర దుకాణం 20వ శతాబ్దంలో ప్రారంభమైంది. నూతన ఒరవడిని అలవరుచుకుంటూ ఆధునిక శైలికి అనుగుణంగా డిజైన్‌లను తయారు చేయడానికి వీరు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పడు తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుని వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు.
తేలా అంబ్రపా వర్క్‌షాప్ పైఅంతస్థుల్లో ఏర్పాటు చేసిన మ్యూజియంలో 16వ శతాబ్దం నాటి నూలు దారాలను ప్రదర్శనకు ఉంచారు. మాస్క్‌లతో పాటు ఇతర ఖరీదైన వస్త్రాలను సైతం తేలా అంబ్రా తయారీ చేస్తోంది. తేలా అంబ్రా వర్క్‌షాప్‌లో తయారు చేసిన మధ్య యుగపు డిజైన్ తయారీ టవల్స్, టేబుల్ క్లాత్‌లు ఒక్కోదానికి 2 వేల యూరోల వరకు వసూలు చేస్తారు.