విదేశాలతో అనుబంధాన్ని పెంచుకునేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా.. బ్రిటన్, మెక్సికో దేశాధినేతలతో ఆయన ఫోన్లో మాట్లాడారు.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు.. బైడెన్ శనివారం ఫోన్ చేశారని శ్వేతసౌధ కార్యాలయం వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే అంశంపై ఆయన మాట్లాడినట్లు తెలిపింది. జీ7 సదస్సు, ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా సంసిద్ధతను బైడెన్ తెలియజేశారని పేర్కొంది.
ఇదీ చూడండి:అమల్లోకి బైడెన్ ఆర్థిక ప్రణాళిక
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం!
కొవిడ్, వాతావరణ మార్పులు వంటి అంశాల్లో సహకారంతో పని చేసే విషయంలో ఇరువురు నేతలు చర్చించారు. దాంతోపాటుగా ఇరుదేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకునే అంశంపైనా చర్చించినట్లు శ్వేతసౌధ మీడియా కార్యదర్శి జెన్ సాకి తెలిపారు.
మెక్సికో అధ్యక్షుడితో..
మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్తోనూ శుక్రవారం.. బైడెన్ ఫోన్లో మాట్లాడారు. ప్రాంతీయ వలసలు వంటి అంశాల్లో ద్వైపాక్షిక సహకారం అంశాలపై వారు చర్చించారు. అక్రమ వలసదారులను అడ్డుకోవడానికి ఇరు దేశాల నేతలు అంగీకరించినట్లు శ్వేతసౌధ కార్యాలయం తెలిపింది. కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో సహకారం అందించుకోవాలని నిర్ణయించుకున్నారని వెల్లడించింది.
ఇదీ చదవండి: ట్రంప్ 'గోడ' నిర్మాణానికి బైడెన్ బ్రేకులు
అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటివరకు మూడుదేశాల నేతలతో ఆయన ఫోన్లో మాట్లాడారు. అంతకుముందు కెనడా ప్రధానితో ఆయన సంభాషించారు.