బ్రిటన్ రక్షణ శాఖకు చెందిన కీలక, రహస్య పత్రాలు బహిర్గతమయ్యాయి. గత మంగళవారం కెంట్ కౌంటీలోని ఓ బస్టాప్ వద్ద వీటిని ఓ పౌరుడు గుర్తించాడు. బ్రిటిష్ మిలటరీ, యుద్ధనౌకల సున్నిత సమాచారం ఆ పత్రాల్లో ఉందని ఆదివారం బీబీసీ మీడియా వెల్లడించింది. రక్షణ శాఖ సీనియర్ అధికారుల ఈమెయిల్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా వాటిలో ఉన్నాయి.
రక్షణ శాఖ కార్యాలయంలో కొన్ని కీలక పత్రాలు మాయమైనట్టు గత వారం ఉద్యోగి ఒకరు ఫిర్యాదు చేసి ఉండటంతో.. అవే ఇవని భావిస్తున్నారు. బ్రిటన్ యుద్ధనౌక 'హెచ్‌ఎంఎస్ డిఫెండర్'ను క్రిమియా సముద్ర జలాల్లోంచి వెళ్లేలా చేస్తే.. రష్యా స్పందన ఎలా ఉంటుందోనన్న చర్చ ఆ పత్రాల్లో ఉంది. ఒకవేళ రష్యా దూకుడుగా స్పందిస్తే దీటుగా ఎదుర్కొనేలా అవసరమైన తుపాకులు, హెలికాప్టర్‌ను యుద్ధనౌకలోని హ్యాంగర్‌లో సిద్ధంగా ఉంచినట్టు అందులో ఉంది.
కాగా క్రిమియా జలాల్లోకి బుధవారం బ్రిటన్ యుద్ధనౌక వచ్చిందని, దాన్ని తమ తీరరక్షక విమానాలు, నౌకలు వెంబడించి కాల్పులు జరిపినట్టు రష్యా ఇప్పటికే వెల్లడించింది. అఫ్గానిస్థాన్ నుంచి ఈ ఏడాది అమెరికా ఆధ్వర్యంలోని నాటో దళాల ఉపసంహరణ పూర్తయ్యాక అక్కడ బ్రిటన్ సైనిక ఉనికికి సంబంధించిన ప్రణాళికలు సైతం ఈ పత్రాల్లో ఉన్నాయి.
ఇదీ చూడండి: బ్రిటన్‌కు దడ పుట్టించిన రష్యా..!