బ్రిటన్ పార్లమెంట్లో నేడు బ్రెగ్జిట్ ఒప్పందంపై చారిత్రక ఓటింగ్ జరగనుంది. ఐరోపా సమాఖ్యతో ప్రధాని బోరిస్ జాన్సన్ కుదుర్చుకున్న తాజా ఒప్పందంపై బ్రిటన్ ఎంపీలు హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఓటింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 31లోపు ఈయూ నుంచి బ్రిటన్ వైదొలుగుతుందా లేక మూడేళ్లుగా నెలకొన్న అనిశ్చితి కొనసాగుతుందా అనే అంశంపై స్పష్టత రానుంది.
ఈ ఓటింగ్ కోసం బ్రిటన్ పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనుంది. 1982 తర్వాత శనివారం రోజున బ్రిటన్ పార్లమెంట్ సమావేశం జరగడం ఇదే తొలిసారి.
విపక్ష పార్టీలతో పాటు ప్రధాని సొంత కూటమి పార్టీలు కొన్ని ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కానీ పార్లమెంట్లో ఎంపీల మద్దతు కూడగట్టేందుకు దాదాపు 48 గంటల పాటు శ్రమించింది జాన్సన్ బృందం. 2016 నుంచి బ్రిటన్ను రాజకీయ గందరగోళంలో పడేసిన బ్రెగ్జిట్ ప్రక్రియకు తాను కుదుర్చుకున్న ఒప్పందం ఎంతో ఉత్తమమైందని పేర్కొన్నారు ప్రధాని.
బ్రెగ్జిట్‌కు నిరసన సెగ...
ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగేందుకు చేసుకున్న తాజా ఒప్పందంపై ఈ రోజు సాయంత్రం 3:30 (భారతీయ కాలమానం ప్రకారం) గంటలకు చర్చ ప్రారంభం కానుంది. ఇప్పటికే బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా బ్రిటన్ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. చారిత్రక ఓటింగ్ నేపథ్యంలో ఒప్పందంపై ప్రజాభిప్రాయం చేపట్టాలనే డిమాండ్లతో ఆందోళనలు జరిగే అవకాశముంది.
ఒకవేళ ఆమోదం లభించకపోతే... బ్రెగ్జిట్‌ను ఆలస్యం చేయడానికి చట్టం రూపొందించాల్సి ఉంటుంది. ఇప్పటికే మూడుసార్లు ఈ తరహా చట్టాన్ని రూపొందించింది ప్రభుత్వం. అయితే బ్రెగ్జిట్‌ను వాయిదా వేయడం కన్నా చావడం మేలని బోరిస్ అభిప్రాయపడ్డారు.
320 ఓట్లు అవసరం..
650 మంది ఉన్న హౌస్ ఆఫ్ కామన్స్‌లో అధికార కన్సర్వేటివ్ పార్టీకి 288 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. మెజారిటీకి 320 ఓట్లు అవసరం. ఈ నేపథ్యంలో కొత్త ఒప్పందానికి బ్రిటీష్ పార్లమెంట్ ఆమోదం లభిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇదీ చూడండి: కొత్త బ్రెగ్జిట్ ఒప్పందంపై యూకే, ఈయూ అంగీకారం