కరోనా వైరస్ మహమ్మారి వెలుగుచూసి ఏడాదిన్నర కావస్తున్నా.. దాని ఉద్ధృతికి ప్రపంచ దేశాలు వణికిపోతూనే ఉన్నాయి. తొలుత పలు దేశాలు వైరస్‌ను కట్టడి చేసినప్పటికీ.. మరోసారి మహమ్మారి చేస్తోన్న విలయానికి కోలుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో మహమ్మారికి ఎదురొడ్డి నిలిచిన కొన్ని దేశాలు వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనడమే కాకుండా వ్యాక్సినేషన్‌లోనూ దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, వైరస్‌కు అడ్డుకట్ట వేసే చర్యలతో పాటు వ్యాక్సినేషన్‌లో ఉత్తమంగా నిలిచిన కొన్ని దేశాలను చూద్దాం...
తైవాన్..
కరోనావైరస్ కట్టడిలో యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోన్న దేశం తైవాన్. 2.3కోట్ల జనాభా కలిగిన తైవాన్‌లో ఇప్పటివరకు కేవలం 1128 పాజిటివ్ కేసులు వెలుగుచూడగా 12 మరణాలు నమోదయ్యాయి. గత ఏడాది అక్డోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న వేళ.. 200 రోజులపాటు అక్కడ స్థానికంగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కఠినంగా వ్యవహరించిన తైవాన్, ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఇదీ చదవండి: 12ఏళ్లు దాటితే వ్యాక్సిన్.. కెనడా అనుమతి!
చైనాలోని వుహాన్ నగరంలో కరోనా వైరస్ ప్రబలుతోందనే విషయం తెలుసుకొన్న తైవాన్.. ఈ విషయాన్ని డిసెంబరు 31నే ప్రపంచ ఆరోగ్య సంస్థకు వెల్లడించింది. అయితే, తైవాన్ మాటలను డబ్ల్యూహెచ్‌ఓ పెడచెవిన పెట్టినప్పటికీ.. తైవాన్ మాత్రం వైరస్ కట్టడికి ముమ్మర చర్యలు చేపట్టింది. కేవలం చైనాకు 130 కి.మీ దూరంలోనే ఉన్న తైవాన్.. అక్కడి నుంచి వస్తున్న వారిని పరీక్షించడమే కాకుండా కొన్ని రోజుల్లోనే వైరస్‌పై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించింది. సెంట్రల్ ఎపిడమిక్ కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసింది. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అనుమానితులను ట్రేస్ చేయడం మొదలు పెట్టింది. ఇప్పటికీ ఆ ప్రక్రియను కొనసాగిస్తోంది. పాజిటివ్ వచ్చిన వారిని క్యాబ్‌లు ఏర్పాటు చేసి ప్రత్యేక హోటళ్లలో ఉంచుతూ వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తోంది.
న్యూజిలాండ్..
కరోనా వైరస్ ప్రభావాన్ని ముందస్తుగానే అంచనా వేసిన న్యూజిలాండ్ చివరకు వైరస్‌పై పోరులో విజయం సాధించింది. గతేడాది ఫిబ్రవరిలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించడం సహా.. సరిహద్దులోనే వైరస్‌ను అడ్డుకునేలా ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తోంది. దేశంలో తొలి వంద కేసులు నమోదైన వెంటనే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఆర్థికవ్యవస్థ కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమన్న న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్.. కరోనా నియంత్రణకు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ 2613 కేసులు మాత్రమే వెలుగుచూడగా.. 26 మరణాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం దేశీయంగా కొత్తకేసులు లేనప్పటికీ విదేశాల నుంచి వచ్చే వారిలో పాజిటివ్ వస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత 40 రోజులుగా అక్కడ ఎలాంటి సామాజిక వ్యాప్తి కేసులు నమోదు కాలేదు.
ఇదీ చదవండి: 'కరోనా విషయంలో భారత్‌కు మద్దతుగా నిలువొద్దు'
సింగపూర్
కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోన్న దేశాల్లో సింగపూర్ కూడా ఒకటి. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇప్పటివరకు అక్కడ 60వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా 30మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడున్న యువ జనాభా వల్లనే మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సరైన ప్రణాళిక, భారీ స్థాయిలో కొవిడ్ పరీక్షలు, సరిహద్దులపై ఆంక్షలు విధించడం, క్వారంటైన్ నిబంధనలు కఠినంగా అమలుచేయడం వంటి చర్యల ద్వారా కరోనా వైరస్ మహమ్మారిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం అక్కడ పాజిటివ్ కేసులను సున్నాకు తీసుకురాగలిగింది. అయితే, 57లక్షల జనాభా కలిగిన సింగపూర్.. 2003లో వచ్చిన సార్స్ విజృంభణ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుందనే చెప్పవచ్చు. తాజాగా వ్యాక్సినేషన్ ప్రక్రియలోనూ సింగపూర్ దూసుకెళ్తోంది. ఇప్పటికే అక్కడి మొత్తం జనాభాలో ఐదోవంతు మందికి వ్యాక్సిన్ అందించగలిగింది.
వియత్నాం..
చైనాలో కరోనా వైరస్ వెలుగు చూపిన వెంటనే అప్రమత్తమైన వియత్నాం.. వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో సఫలీకృతమైంది. జనవరి 30, 2020న తొలి కేసు నమోదైన వెంటనే పక్కా ప్రణాళికను రూపొందించుకుంది. అప్పటికీ చాలా దేశాలు మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కానీ, వియత్నాం మాత్రం ముందుజాగ్రత్తగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో కొవిడ్ పరీక్షలను ముమ్మరంగా చేపట్టింది. అక్కడి కొత్త సంవత్సరం (ల్యూనార్ ఇయర్) కారణంగా అప్పటికే అక్కడ పాఠశాలలు మూతపడ్డాయి. వీటిని మే నెల వరకూ మూసివేసి ఉంచింది. అంతేకాకుండా విదేశీ పర్యాటకులను అక్కడ నుంచి పంపిచివేసింది. అనంతరం కొన్నిరోజుల పాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించింది. వీటితో పాటు కాంటాక్ట్ ట్రేసింగ్ సమర్థవంతంగా చేపట్టడం సహా.. మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఇలా వైరస్ నియంత్రణకు ప్రణాళికతో కట్టడిచేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని పూర్తిగా అదుపులోకి తీసుకురాగలిగింది. ఇప్పటివరకు అక్కడ 2928 కేసులు, 35 మరణాలు రికార్డయ్యాయి.
ఇదీ చదవండి: టీకాల విషయంలో భారత్‌పై కొరియా సెటైర్!
ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా దేశాలు..
కరోనా వైరస్ తీవ్రతను చవిచూసిన ఇజ్రాయెల్ కూడా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో సఫలమయ్యింది. ఇప్పటివరకు అక్కడ 8లక్షల 38వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా 6363 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈనేపథ్యంలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలుచేస్తోంది. దీంతో ఇప్పటికే అక్కడ దాదాపు 60శాతం జనాభాకు వ్యాక్సిన్ అందించింది.
ఇక కరోనా కట్టడిలో ముందున్న ఆస్ట్రేలియా కూడా మహమ్మారి పోరులో సఫలీకృతమైందనే చెప్పవచ్చు. ఇప్పటివరకు అక్కడ 29వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, 910 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి నెల అక్కడ సరాసరి రెండు కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ప్రతి పది లక్షల జనాభాకు 36 మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగానే చేపడుతోంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా మొత్తం జనాభాలో దాదాపు 3.8శాతం మందికి వ్యాక్సిన్ అందించగలిగింది.
ఐస్‌లాండ్..
జనాభా తక్కువగా ఉన్న ఐస్‌లాండ్ కూడా వైరస్ వ్యాప్తిని అదేస్థాయిలో కట్టడి చేసింది. ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్లిన ఐస్‌లాండ్ కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంది. పాజిటివ్ వచ్చిన వారిని ఇళ్లలోనే ఉండమని ప్రభుత్వ ఆదేశమివ్వడం వల్ల చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. అలాంటివారికి ప్రభుత్వమే ఆర్థిక సహాయం అందించింది. ఇప్పటివరకు అక్కడ 6472 కేసులు, 29 మరణాలు చోటుచేసుకున్నాయి.
ఇదీ చదవండి: 'జూన్ 4లోపు 70శాతం మందికి టీకాలు'