ఆస్ట్రియా టైరల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లికి అందే పింఛనుపై కన్నేసిన ఓ వ్యక్తి.. ఆమె మరణాంతరం ఏడాదిపాటు మృతదేహాన్ని ఇంట్లోనే దాచిపెట్టాడు. అధికారులను మోసం చేస్తూ ఎప్పటికప్పుడు డబ్బులు వసూలు చేశాడు.
ఇంటి బేస్మెంట్లో...
టైరల్ రాష్ట్ర పోలీసులు.. ఇన్స్బ్రక్ ప్రాంతంలో గురువారం ఓ ఇంటికి వెళ్లారు. 89ఏళ్ల వృద్ధురాలు.. 2020 జూన్‌లో మరణించిందన్న అనుమానంతో ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇంటి బేస్మెంట్లో వృద్ధురాలి మృతదేహం దొరికింది. వెంటనే ఆమె కొడుకును అరెస్ట్ చేశారు.
విచారణలో భాగంగా.. తల్లి మరణించిన అనంతరం.. ఆమెకు వచ్చే పింఛను, నర్సింగ్ అలవెన్స్ కోసం.. మృతదేహాన్ని బేస్మెంట్లో దాచిపెట్టినట్టు 66ఏళ్ల ఆ వ్యక్తి అంగీకరించాడు. ఇప్పటివరకు ఆ వ్యక్తికి.. 50వేల యూరోలు అందినట్టు తెలుస్తోంది. అతడికి తల్లి పింఛను మినహా మరే ఇతర ఆదాయం లేదని పోలీసులు తెలిపారు.
పింఛను కోసం తల్లిని కొడుకే హతమార్చాడా? అన్న కోణంలో విచారణ జరిగింది. అయితే అందుకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. శవపరీక్షలోనూ అలాంటిదేదీ బయటపడలేదు.
ఇలా బయటపడింది..
పింఛను అందించేందుకు ఓ కొత్త పోస్ట్‌మ్యాన్ ఆ వ్యక్తి ఇంటికి వెళ్లాడు. పింఛను ఇవ్వాలంటే లబ్ధిదారును పిలవాలని డిమాండ్ చేశాడు. దీనికి ఆ వ్యక్తి నిరాకరించాడు. అనుమానం వచ్చి పోస్ట్‌మ్యాన్ అధికారులకు ఈ విషయాన్ని చెప్పాడు. ఆ ఇంటికి వెళ్లిన పోలీసులు.. బేస్మెంట్లో ఐస్ప్యాకెట్లు, బ్యాండేజీలతో కట్టి ఉన్న మృతదేహాన్ని గుర్తించారు.
ఇదీ చూడండి:- కుటుంబ సభ్యులే హత్యకు ప్రయత్నించి.. చివరికి..