అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోని వ్యోమగాములకు తాజా యాపిల్ ఫలాలు అందనున్నాయి. వాటితో పాటు పలు ఇతర ఆహార పదార్థాలు, పరిశోధక సామగ్రిని ఫాల్కన్-9 రాకెట్ ద్వారా స్పేస్ ఎక్స్ కంపెనీ పంపించనుంది. మొత్తంగా 3,300 కిలోల బరువున్న రకరకాల పదార్థాలను అది చేరవేయనుంది. ఐఎస్‌ఎస్‌కు కార్గోను పంపించనుండటం ఇది 22వసారి. తాజా కార్గోలో యాపిల్స్‌తో పాటు నారింజలు, ఉల్లిగడ్డలు, నిమ్మకాయలు, అవకాడోలు తదితర 341 కిలోల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్-9 గురువారం బయలుదేరి వెళ్లనుంది. సదరు వ్యోమనౌక.. 2,404 కిలోల పరిశోధక నమూనాలు, ఇతర సామగ్రితో జులైలో తిరిగి భూమిని చేరుకుంటుంది.
రష్యా వ్యోమగాముల స్పేస్‌వాక్
ఐఎస్‌ఎస్ నుంచి రష్యా వ్యోమగాములు ఒలెగ్ నొవిస్కీ, ప్యోర్ డుబ్రోవ్ బుధవారం బయటకు వచ్చి 7 గంటల 19 నిమిషాల పాటు స్పేస్‌వాక్ చేశారు. త్వరలో రష్యాకు చెందిన ఓ నూతన మాడ్యూల్ ఐఎస్‌ఎస్‌కు చేరుకోనుండటంతో.. అందుకు అవసరమైన మరమ్మతులను వారు చేపట్టారు. ఫ్లూయిడ్ ఫ్లో రెగ్యులేటర్‌ను మార్చారు. ఒలెగ్, ప్యోర్ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. వారిద్దరికీ ఇదే తొలి స్పేస్‌వాక్.
ఇదీ చదవండి:20.5 కోట్ల మంది నిరుద్యోగంలోకి..