రోజురోజుకూ పెరుగుతున్న ప్రపంచ జనాభాతో ఆహార ఉత్పత్తికి డిమాండ్ పెరుగుతోంది. కానీ.. సరిపడా పంటలు పండటం లేదు. మాంసం లభించడం లేదు. ఫలితంగా భవిష్యత్తులో ఆహార కొరత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచిస్తున్నారు. కీటకాలను ఆహారంలో భాగం చేయడం ద్వారా ఈ కొరతను తగ్గించవచ్చని అభిప్రాయపడుతున్నారు. బీఫ్, పోర్క్ల కన్నా ఈ కీటకాల ద్వారా ఎక్కువ పోషకాలు అందుతాయని చెబుతున్నారు. ఇప్పటికే 130 దేశాల్లోని 200 కోట్ల మందికి ఆహారంలో కీటకాలు భాగమే.
కీటకాలు పోషకాలను అందిస్తాయన్న మాట అటుంచితే అసలు వీటిని తినేదెలా అని చాలా మందికి అనిపిస్తుంది. అయితే ఈ కీటకాలతో పిజ్జా, బర్గర్ సహా వివిధ రకాల పాశ్చాత్య వంటలను తయారు చేస్తున్నారు బ్రిటన్‌కు చెందిన టిజియానా ది కోస్టాంజో. హారిజాన్ ఇన్సెక్ట్స్ పేరుతో ఎడిబుల్ ఇన్సెక్ట్స్ వ్యాపారం చేస్తున్న కోస్టాంజో.. కీటకాలతో తయారు చేసిన వివిధ రకాల ఆహార ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.
ఈ ఉత్పత్తులు పోషకాలను ఇవ్వడమే కాక రుచిగా కూడా ఉంటాయని అంటున్నారు కోస్టాన్జో.
"మా ఉత్పత్తుల్లో ప్రధానమైనది కీటకాల బర్గర్. ఈ మీల్వార్మ్ బర్గర్ తయారుచేయడం చాలా సులువు. అంతేకాదు.. ఇది రుచికరంగా కూడా ఉంటుంది. ఈ కీటకాలను ఎండపెట్టి పొడిగా చేస్తే.. ఆ పొడిని కేక్స్, బ్రెడ్, పాస్తాల తయారీకి కూడా ఉపయోగించొచ్చు. మేము వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాము."
-టిజియానా ది కోస్టాన్జో
డిమాండ్ ఎక్కువే..
ప్రపంచవ్యాప్తంగా ఈ ఎడిబుల్ ఇన్సెక్ట్ మార్కెట్‌కు ఏటా డిమాండ్ పెరుగుతూ వస్తోందని అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి. 2030 నాటికి ఈ మార్కెట్ విలువ 8 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ప్రముఖ అంతర్జాతీయ బ్యాంక్ బార్క్లేస్ అంచనా వేసింది. ఈ విలువ 2019లో 1 బిలియన్ డాలర్ల కన్నా తక్కువే ఉండేదని తెలిపింది. 2030 నాటికి ఒక్క ఐరోపాలోనే.. కీటకాల ఉత్పత్తులు 2,60,000 మెట్రిక్ టన్నులకు చేరుకుంటాయని బ్రసల్స్కు చెందిన ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫాం ఆఫ్ ఇన్సెక్ట్స్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ పేర్కొంది. ప్రస్తుతం ఈ 500 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతున్నాయని చెప్తోంది.
పశువుల పెంపకంతో పోలిస్తే పురుగుల పెంపకానికి తక్కువ ఖర్చు అవుతుందని.. పెద్దగా స్థలం కూడా అవసరం లేదంటున్నారు నిపుణులు.
ఈ కీటకాల ఉత్పత్తులను అసలు ఆహారంగా పరిగణించని దేశాలు.. ఇప్పుడు వాటిని జంతువుల పెంపకంలో ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే మిడతలు సహా పలు కీటకాలను ఆహార ఉత్పత్తులగా వినియోగించేందుకు ఐరోపా సమాఖ్య ఆమోదం తెలిపింది.
మరో రెండేళ్లలో ఆహార ఉత్పత్తుల్లో ఎన్నో మార్పులు వస్తాయన్నారు ప్రొటిక్స్ సంస్థ సీఈఓ కీస్ ఆర్ట్స్. భవిష్యత్తులో ఈ కీటకాల ఉత్పత్తులు జంతు ఆహారంగా మాత్రమే పరిమితం కావని మనుషుల ఆహారంగా కూడా వాడుకలోకి వస్తాయని అశిస్తున్నారు.
"భవిష్యత్తులో ఈ ఉత్పత్తులకు కేవలం జంతు ఆహారంగానే కాకుండా మనిషి ఆహారంగా కూడా డిమాండ్ పెరుగుతుంది. రుచి, పోషక పదార్థాలు ఎక్కువ ఉన్న ఆహార ఉత్పత్తులపై మనిషి దృష్టి సారించడమే ఇందుకు కారణం. రానున్న రెండేళ్లలో ఆహార రంగంలో కీటకాల ఉత్పత్తులు కీలక పాత్ర పోషిస్తాయి."
-కీస్ ఆర్ట్స్, ప్రొటిక్స్ సీఈఓ
'టైం పడుతుంది'
ఈ కీటక ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నో స్టార్టప్‌లు పుట్టుకొస్తున్నా.. ఇవి రోజూవారీ ఆహార పదార్థాల్లో భాగం అవడానికి కొంత సమయం పడుతుంది. రెస్టారెంట్ మెనూల్లో ఈ ఉత్పత్తులతో చేసిన వంటలు చోటుసంపాదించాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే అంటున్నారు నిపుణులు. కీటకాలను ఆహారంగా తీసుకోవడంపై ప్రస్తుతం భోజనప్రియులకు ఉన్న అభిప్రాయమే అందుకు కారణం అంటున్నారు.
ఇవీ చూడండి : తప్పిన భారీ ముప్పు- సౌర తుపాను ప్రభావం శూన్యం!