దేశానికి 34 ఏళ్ల వయసులో ప్రధానమంత్రి కావడం మామూలు విషయం కాదు. అదీ ఒక మహిళ. కానీ సనా మారిన్ ఆ ఘనత సాధించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఐదు పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆమె నడపనుంది. ఇంత చిన్న వయసులో అంత పెద్ద బాధ్యతలు నిర్వహించడం అంత తేలిక కాదు. కానీ ఫిన్లాండ్ ప్రజలు ఆమెను నమ్మారు. కారణం.. సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి ఆమె అంచలంచెలుగా ఎదిగిన వైనమే.
సనా మారిన్‌ది సాధారణ మద్యతరగతి కుటుంబం. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి పెంపకంలోనే సనా పెరిగింది. తల్లి మరో మహిళతో సహజీవనం చేయడంతో బాల్యంలో సనా.. ముభావంగా ఉండేది. అంతగా స్నేహితులతో కలిసేది కాదు. అదే సమయంలో ఆమె ఎక్కడా కుంగిపోలేదు. చదువుతూనే పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసింది. ఆరంభంలో. స్థానిక బేకరీలో పని చేసింది. పదిహేనేళ్ల వయసులో వీధుల్లో మ్యాగజైనులు అమ్మింది. ఓ దుకాణంలో క్యాషియర్‌గా పని చేసింది. అలా పనిచేస్తూనే ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించింది.
రుణం తీర్చలేనేమోనని...
ఉన్నత విద్యాభ్యాసం కోసం రుణాలు తీసుకుంటారు. కానీ సనా అలా రుణం తీసుకోవడానికి భయపడింది. అందుకే టేంపేర్ విశ్వ విద్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ డిగ్రీలో చేరడానికి ముందు తటపటాయించింది. కానీ తర్వాత ఓ సంస్థలో సేల్స్‌విమెన్‌గా పని చేసింది. అలా చేస్తూనే డిగ్రీ పూర్తి చేసింది.
అంచెలంచెలగా...
20 ఏళ్లకే మారిన్ విద్యార్థి ఉద్యమాల్లో ప్రవేశించింది. ఎన్నో సామాజిక ఉద్యమాల్లో పాల్గొంది. సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఫిన్లాండ్(ఎస్‌డీపీ)లో చేరి.. ఆ పార్టీ తరఫున రెండు సార్లు టేంపేర్ సిటీ కౌన్సిలర్‌గా ఎన్నికైంది. 2015లో సనామారిన్ రాజకీయ జీవితం మరో మలుపు తిరిగింది. టేంపేర్ నుంచి పార్లమెంటు అభ్యర్థిగా మారిన్‌ను ఎస్‌డీపీ పార్టీ ప్రకటించింది. ఆ ఎన్నికల్లో ఆమె 10,911 ఓట్ల మెజారిటీతో నెగ్గి పార్లమెంటులో అడుగు పెట్టింది. ప్రభుత్వంలో రవాణా, సమాచార మంత్రిగా బాధ్యతలు కూడా సమర్థంగా నిర్వహించింది. అందుకే నవంబరులో జరిగిన తపాలా సిబ్బంది సమ్మెకు అడ్డుకట్ట వేయడంలో విఫలమైన ప్రస్తుత ప్రధాని ఆటీ రెన్‌ను తొలగించాలని నిర్ణయించిన వెంటనే మారిన్‌నే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎస్‌డీపీ పార్టీ ప్రకటించింది.
ఆమె సాధారణ మధ్యతరగతి అమ్మాయే. తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఓ సగటు అమ్మాయిలా తానూ కష్టాలు పడింది. బేకరీలో పని చేసింది. వీధుల్లో మ్యాగజైన్‌లు అమ్మింది దుకాణంలో క్యాషియర్‌గా, సేల్స్‌విమెన్‌గా.. ఇలా ఎన్నో ఉద్యోగాలు చేసింది. కుటుంబానికి తన వంతు అండగా నిలిచింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏకంగా తన దేశానికే అండగా నిలవనుంది. ఆమే ఫిన్లాండ్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న 34 ఏళ్ల సనా మారిన్.లు
ఫిన్లాండ్‌లో ఐదు పార్టీలతో కలిసి ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వానికి 34 ఏళ్ల సనా మారిన్ ప్రధానమంత్రిగా ఎంపికైంది. ఆసక్తికరమైన విషయమేంటంటే సంకీర్ణంలో ఉన్న మిగతా నాలుగు పార్టీలకు కూడా మహిళలే అధ్యక్షత వహించడం. సంకీర్ణంలో సోషల్ డెమొక్రటిక్ పార్టీకి మారిన్ నాయకత్వం వహిస్తుండగా, లఫె్ట్ అలయన్స్ పార్టీకి అండర్సన్, సెంటర్‌పార్టీకి కత్రి కుల్‌ముని, గీన్ర్ లీగ్‌కు మారియా, స్వీడీష్ పీపుల్స్ పార్టీ ఆఫ్ ఫిన్లాండ్‌కు హెనెక్సన్ నాయకత్వం వహిస్తున్నారు.
స్పేచ్ఛ అంటే...
కుటుంబపరంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా ఎలాంటి నేపథ్యం లేకపోయినా.. ఏదైనా సాధించే స్వేచ్ఛ ప్రతి పౌరుడికీి ఉండాలి. ఈ విషయంలో సమాజం నిర్వహించాల్సిన పాత్ర చాలా కీలకమని నమ్ముతాను. ఎక్కడా వివక్షకు తావుండకూడదు. ప్రతి పౌరుడికీ సమానహక్కులు ఉండాలి.
సమానత్వమంటే
నాణ్యమైన జీవితం గడిపే హక్కు ప్రజలందరికీ ఇవ్వడమే సమానత్వం.. సమాజంలో జరిగే పరిణామాలను ప్రభావితం చేయగలిగే శక్తి ప్రతి పౌరుడికీ ఉండాలి. ఇందుకు ఎలాంటి అవరోధాలు ఉండకూడదు. ఉంటే వాటిని రాజకీయ వ్యవస్థ తొలగించాలి.
ఇదీ చూడండి : రూ.85 లక్షలు విలువైన అరటి పండును తినేశాడు!