స్పెయిన్‌కు చెందిన 113 ఏళ్ల మరియా బ్రన్యాస్ అనే వృద్ధురాలు కరోనా నుంచి బతికి బయటపడ్డారు. మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో ఈమె ప్రపంచంలోనే అతి పెద్ద వయస్కురాలు. మరియాకు ఏప్రిల్‌లో కరోనా సోకింది. ఓల్డేజ్ కేర్ హోంలోని తన గదిలో ఐసోలేషన్‌లో ఉంటూ ఆమె వైరస్‌పై పోరాడారు.
వందేళ్ల కింద స్పానిష్ ఫ్లూను జయించి..
"ప్రస్తుతం నా ఆరోగ్యం ఎంతో బాగుంది. చిన్నపాటి ఒళ్లు నొప్పులున్నాయి. ఇవి అందరూ ఎదుర్కొనేవే" అని సంతోషం వెలిబుచ్చారు. మరియా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన వారు. స్పెయిన్‌లో స్థిరపడ్డారు. 1918-19లో విజృంభించిన స్పానిష్ ఫ్లూ నుంచీ ఈమె గట్టెక్కడం గమనార్హం.
రెండు ప్రపంచ యుద్ధాలు సహా 1936-39 మధ్య జరిగిన స్పానిష్ అంతర్యుద్ధాన్నీ మరియా చూశారు. స్పెయిన్‌కు చెందిన వృద్ధాప్య పరిశోధన సంస్థ ఆమెను దేశంలోకెల్లా పెద్ద వయస్కురాలిగా గుర్తించింది. మరియాకంటే ముందు ఈ దేశానికే చెందిన అనా దెల్ వాల్లె అనే 106 ఏళ్ల మహిళ కరోనా నుంచి కోలుకున్న అతిపెద్ద వయస్కురాలిగా గుర్తింపు పొందారు. ఇప్పుడా రికార్డు చెరిగిపోయింది.