ఇంగ్లాండ్ బర్మింగ్హామ్ కత్తిపోట్ల ఘటనలో ఒకరు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. మరో ఏడుగురు గాయపడినట్టు వివరించారు. ఈ పూర్తి వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు.
ఆదివారం అర్ధరాత్రి 12:30గంటల సమయంలో బర్మింగ్హామ్ నగరంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. అయితే ఇది ఉగ్రవాద చర్య కాదని వెస్ట్ మిడ్లాండ్ పోలీసులు భావిస్తున్నారు. అర్ధరాత్రి 12:30కు మొదలై.. 2:20 వరకు అనేక కత్తిపోట్ల ఘటనలు జరిగాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరమంతటా అదనంగా పోలీసులను మోహరించారు.
ఎందుకిలా?
నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. కాన్స్టిట్యూషన్ హిల్ నుంచి అతడు కత్తులతో దాడికి దిగినట్టు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ దృశ్యాలు ఏవైనా ఉంటే.. వెంటనే తమను సంప్రదించమని పోలీసులు ప్రజలకు తెలిపారు.
ఈ ఘటన భయానకమని బర్మింగ్హామ్ చీఫ్ సూపరింటెండెంట్ అభిప్రాయపడ్డారు. కత్తిపోట్లకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు.
అయితే.. ఈ ఘటనకు కారకులెవరు? ఎందుకిలా చేశారు? అనే వివరాలపై ఇంకా స్పష్టత లేదని అధికారులు చెప్పారు.
ప్రత్యక్ష సాక్షి...
మరోవైపు.. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఒకరు స్పందించారు. ఓ క్లబ్లో తన డ్యూటీ ముగించుకుని బయటకు వచ్చే సరికి... అనేక మంది గొడవపడటం మొదలు పెట్టారని, బృందాలుగా విడిపోయి కొట్టుకున్నారని వివరించారు. జాతి విద్వేష వ్యాఖ్యలతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారని వెల్లడించారు.
ఇదీ చూడండి:- గ్యాస్ పైప్ పేలిన ఘటనలో 24కు చేరిన మృతులు