చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రెండు రోజుల భారత్ పర్యటన నేడు ప్రారంభంకానుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- జిన్‌పింగ్ మధ్య రెండవ అనధికారిక సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా తమ స్నేహ బంధానికి చిహ్నంగా మోదీకి పలు కానుకలను ఇవ్వనున్నారు చైనా అధ్యక్షుడు. ఈ విషయాన్ని డ్రాగన్ దేశ విదేశాంగశాఖ తెలిపింది.
"మోదీతో జిన్‌పింగ్‌కు ఉన్న స్నేహం, భారత్- చైనా మధ్య నెలకొన్న గొప్ప ద్వైపాక్షిక సంబంధాలకు చిహ్నంగా ఈ కానుకలు నిలువనున్నాయి."
--- చైనా విదేశాంగశాఖ ప్రకటన.
గత కొన్ని సంవత్సరాల్లో మోదీ-జిన్‌పింగ్ అనేక మార్లు కలుసుకున్నారు. ముఖ్యంగా 2018లో వూహాన్ వేదికగా జరిగిన తొలి అనధికార సమావేశంతో అగ్రనేతల మధ్య మైత్రి మరింత బలపడింది. ఈ స్నేహమే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఉపయోగపడింది.
ప్రముఖ చైనా చిత్రకారుడు బైహాంగ్ గీసిన చిత్రపటాలను వూహాన్ సమావేశంలో జిన్‌పింగ్‌కు కానుకగా ఇచ్చారు మోదీ. విశ్వ భారతి విశ్వవిద్యాలయంలో బైహాంగ్ ఉపాధ్యాయుడిగా సేవలందించారు.
ఇదీ చూడండి:- ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మూడేళ్లుగా కుట్ర!