జనవరిలో చైనాలో నూతన సంవత్సరం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ సామూహిక విందు వైరస్ వ్యాప్తిని వేగవంతం చేసిందని సీఎన్‌ఎన్ ప్రతినిధి ఫరీద్ జకారియా నిర్వహించిన పరిశోధనలో తేలింది. జనవరి 19న వుహాన్‌లోని 'ది బైబుటింగ్' అనే కమ్యూనిటీలో అతిపెద్ద 'పాట్‌లక్' విందు నిర్వహించారు. దాదాపు 40 వేల కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి. అప్పటికే వైరస్ వుహాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించింది. అయినా.. ప్రపంచ రికార్డు కోసం స్థానిక అధికారులు ఈ కార్యక్రమాన్ని రద్దు చేయకుండా కొనసాగించారు.
57 భవనాలకుగాను 33 చోట్ల వైరస్.!
ఈ విందు ముగిసిన తర్వాత ఆ ప్రాంతంలో కరోనావైరస్ వేగంగా విజృంభించింది. ఆ ప్రదేశంలో 57 భవనాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కో భవనంలో 14 కుటుంబాలు ఉంటున్నాయి. దాదాపు 15 రోజుల్లోపే అక్కడ 33 భవనాల్లో కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. వీటిని ‘ఫీవర్ బిల్డింగ్స్’ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ ప్రదేశంలో మొత్తం 1,30,000 మంది ఉంటున్నారు. పొరుగు కమ్యూనిటీవారు వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని విందు రద్దు చేయాలని కోరారు. కానీ, అక్కడి జిల్లా అధికారులు మాత్రం మొండిగా దీనిని కొనసాగించారు. ఈ పార్టీ నిర్వహించిన రోజే దేశంలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు వుహాన్ చేరుకొన్నారు. జనవరి 23 నాటికి పరిస్థితి చేజారుతుందని వారికి అర్థమైపోయింది. వెంటనే వుహాన్ పట్టణంలో లాక్‌డౌన్ విధించారు. కానీ అప్పటికే వుహాన్ నుంచి లక్షల మంది దేశ సరిహద్దులు దాటేశారు. వారిలో ఈ పార్టీలో పాల్గొన్నవారెందరో లెక్కతెలియదు.
రికార్డు పిచ్చి..
‘ది బైబుటింగ్’ కమ్యూనిటీలో నిర్వహించిన సామూహిక విందులో అత్యధిక వంటకాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాలని నిర్వాహకులు భావించారు. దీంతో చాలా కుటుంబాలు ఇళ్లలోనే ప్రత్యేకమైన వంటకాలు వండుకొని ఈ విందుకు తీసుకొచ్చాయి. ఇలా మొత్తం 13,986 రకాల వంటకాలను వడ్డించినట్లు ‘దిసౌత్ చైనా మార్నింగ్ పోస్టు’ సంస్థ తన కథనంలో పేర్కొంది. సాధారణంగా చైనీయులు తినడానికి వినియోగించే స్పూన్లు, చాప్‌స్టిక్స్‌తోనే వడ్డించుకొంటారు. దీంతో వైరస్ వ్యాప్తి సులభమైపోయింది. ఈ ఘటన తర్వాత చైనా అధికారులు విందుల్లో వంటకాలు వడ్డించుకోవడానికి ‘పబ్లిక్ చాప్‌స్టిక్స్’, ‘పబ్లిక్ స్పూన్ల’ను ఉంచాలనే నిబంధనలను బలంగా అమలు చేయడం మొదలుపెట్టారు. వీటిని జపాన్, దక్షిణ కొరియా, తైవాన్‌లో ఎప్పటి నుంచో వినియోగిస్తున్నారు. కానీ, చైనాలో సంపన్న రెస్టారెంట్లు, కొన్ని కుటుంబాలు మాత్రమే పబ్లిక్ చాప్‌స్టిక్స్ వినియోగిస్తాయి. పైగా వడ్డీంచేందుకు ప్రత్యేకంగా సామగ్రిని ఉపయోగించడాన్ని ఇష్టపడరు.
సార్స్ వలే కరోనావైరస్‌ను కూడా కట్టడి చేస్తామని చైనా ప్రభుత్వాధికారులు మొదట విశ్వసించారు. అందుకే ప్రపంచ రికార్డు సాధించడం కోసం ఈ విందుకు అనుమతించారు. చివరికి ప్రపంచాన్నే క్వారెంటైన్‌లోకి నెట్టిన రికార్డు వుహాన్‌కు దక్కింది. అంతేకాదు పదిరోజుల్లో ఆసుపత్రి నిర్మించిన రికార్డును కూడా దక్కించుకొంది.!
ఇదీ చదవండి: యుద్ధ సన్నద్ధత పెంచండి: చైనా అధ్యక్షుడి కీలక ఆదేశం