ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ దేశాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 18 లక్షలకు చేరువలో ఉన్నాయి. లక్షా 8వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. అమెరికాలో సగటున రోజుకు 2వేల మంది చనిపోతున్నారు. ఫలితంగా అగ్రరాజ్యంలో కరోనా మృతుల సంఖ్య ఇటలీని దాటింది. స్పెయిన్‌లో మాత్రం కరోనా మరణాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
లాక్డౌన్ ఎత్తివేయండి
ఇటలీలో కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న తరుణంలో అక్కడి ప్రజలు లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతున్నారు. ఐదు వారాలుగా ఒంటరితనంతో జీవిస్తున్నామని, వేసవి కారణంగా ఉక్కపోతను భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటలీలో 24 గంటల్లో 619 మంది మహమ్మారికి బలయ్యారు. మరో దాదాపు 5 వేల మందికి వైరస్ సోకింది.
స్విట్జర్లాండ్‌లో...
స్విట్జర్లాండ్‌లోనూ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు 25 వేల కేసులు నమోదు కాగా... వెయ్యి మందికి పైగా మరణించారు.
ఫ్రాన్స్‌లో...
ఫ్రాన్స్‌లోనూ కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 643 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 353 మంది ఆసుపత్రుల్లో మరణించగా, మరో 290 మంది నర్సింగ్ హోంలో మృతి చెందినట్లు తెలిపారు. మరో 4,800 కేసులు నమోదయ్యాయి.