ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. కరెన్సీ నోట్లు, స్మార్ట్ఫోన్ తెరలపై 28 రోజుల వరకూ చైతన్యవంతంగా ఉంటున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. ఆస్ట్రేలియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రిపేర్డ్నెస్ పరిశోధకులు దీన్ని చేపట్టారు. ఇందులో భాగంగా వివిధ రకాల వస్తువులపై కృత్రిమ శ్లేష్మంతో కూడిన కరోనా వైరస్ను ఉంచారు. తర్వాత ఉష్ణోగ్రతలను 30నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య మార్చుతూ సుమారు నెల రోజుల పాటు ఆ నమూనాలు పరీక్షించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ వైరస్ బలహీనపడినట్లు గుర్తించారు.
'గాజు పాత్రలు, స్మార్ట్ఫోన్ తెరలు, స్టెయిన్లెస్ స్టీల్, కరెన్సీ నోట్లు వంటి నునుపైన వస్తువులపై వైరస్ ఎక్కువ రోజులు ఉంటోంది. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు.. ముఖ్యంగా 20 డిగ్రీల సెల్సియస్ వద్ద వైరస్ చాలా బలంగా ఉంటోంది. వస్తువుల రకం, పరిసరాల ఉష్ణోగ్రత, వైరస్ తీవ్రత, శరీరం నుంచి వెలువడే శ్లేష్మం, నీటి తుంపర్లలోని ప్రొటీన్, కొవ్వు స్థాయులపై ఆధారపడి వైరస్ మనుగడ సాగిస్తోంది. అని పరిశోధనకర్త డెబ్బీ ఈగ్లెస్ పేర్కొన్నారు. ఈ వివరాలను 'వైరాలజీ జర్నల్' అందించింది.