అఫ్గాన్‌లో ప్రభుత్వాన్ని(Taliban Govt) ఏర్పాటు చేసిన తాలిబన్లు.. మంత్రివర్గంలో మహిళలకు (Afghanistan woman) స్థానం కల్పించలేదు. ఇదే విషయంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ సాగుతోంది. మహిళలకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ అఫ్గాన్ మహిళలు రోడ్లపైకి చేరి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తాలిబన్ల ప్రతినిధి సయ్యద్ జెక్రుల్లా హాషిమి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహిళలు మంత్రులు అవ్వలేరని, వారు పిల్లలకు జన్మనిస్తే చాలని తీసికట్టుగా మాట్లాడారు.
స్థానిక టోలో న్యూస్ ఇంటర్వ్యూలో జెక్రుల్లా హాషిమి మాట్లాడుతూ.. 'మహిళలు మంత్రులు కాలేరు. ఇలాంటి బాధ్యత వారికి అప్పగిస్తే.. వారి తలపై మోయలేనంత బరువు మోపినట్లే అవుతుంది. కేబినెట్‌లో మహిళలు ఉండాల్సిన అవసరంలేదు. వారు పిల్లలకు జన్మనిస్తే చాలు. మహిళా నిరసనకారులు దేశంలోని మహిళలందరికీ ప్రాతినిధ్యం వహించలేరు' అని పేర్కొన్నారు.
సమాజంలో మహిళలు సగభాగం కదా.. అన్న జర్నలిస్టుకు హాషిమి సమాధానమిస్తూ 'మేము వారిని సగభాగమని భావించం. ఏ విషయంలో వారు సగభాగం? అంటే వారిని తీసుకెళ్లి మంత్రివర్గంలో కూర్చోబెట్టడమా? వారి హక్కులను కాలరాస్తున్నామని భావిస్తే అదేం పెద్ద విషయం కాదు. గత 20 ఏళ్లలో కార్యాలయాల్లో జరిగింది వ్యభిచారమేగా? అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం గానీ, మీడియా కానీ ఈ విషయాలను బయటపెట్టలేదని తాను చేసిన వ్యాఖ్యలను హాషిమి సమర్థించుకున్నారు.
అందరు మహిళలపై అలా ఆరోపణలు చేయడం సరికాదని జర్నలిస్టు పేర్కొనగా 'నేను అందరు మహిళల గురించి మాట్లాడటంలేదు. రోడ్లపైకి చేరి నిరసన తెలుపుతున్న ఆ నలుగురు మహిళలు దేశంలోని అందరు మహిళలకు ప్రాతినిధ్యం వహించలేరు. అఫ్గాన్లకు జన్మనిచ్చి, వారికి ఇస్లాం నీతిని బోధించేవారే నిజమైన అఫ్గాన్ మహిళలు' అని పేర్కొనడం గమనార్హం.
ఇదీ చూడండి: Taliban Government: అఫ్గాన్‌లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం వాయిదా