'శీతాకాలంలో ఆహార కొరత రావచ్చు.. ఇళ్లల్లో నిల్వలు పెంచుకోండి' 'ఎవరైనా బింజ్ (ఎక్కువగా తిండితినే) వీడియోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తే శిక్షిస్తాం' ఇదేదో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు కాదు.. ఆర్థిక శక్తిలో అమెరికాకు సవాలు విసురుతున్న చైనా పాలకుల ఆదేశాలు. కొవిడ్, శీతాకాలం దృష్ట్యా ఇలా చేస్తున్నాం (china food crisis) అని వారు చెబుతున్నారు. వాస్తవానికి దేశ పాలకుల చిన్నచిన్న తప్పుడు నిర్ణయాలు పెను సంక్షోభాన్ని ఎలా సృష్టిస్తాయో కొవిడ్ వ్యాప్తితో ప్రపంచం తెలుసుకొంది. ఆ దేశంలో సమస్య ఎంతో తీవ్రంగా ఉంటేగానీ.. బాహ్య ప్రపంచానికి తెలిసేలా చిన్నచిన్న ప్రభుత్వ ప్రకటనలు వెలువడవు. తాజా ఆహార సంక్షోభం కూడా అదే కోవకు వస్తుంది. ప్రకృతి ప్రకోపం.. పాలకుల నిర్ణయాలు కలిసి అక్కడ కృత్రిమ సంక్షోభాలను సృష్టిస్తున్నాయి.
సాధారణ వార్తలా..!
రెండ్రోజుల క్రితం చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబ్లల్ టైమ్స్‌లో ఓ వార్త వెలువడింది. 'ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత రావొచ్చు.. చైనీయులు ముందుగానే సరకులు (china food crisis 2021) కొనుగోలు చేసి నిల్వ చేసుకోండి' అన్నది దీని సారాంశం. పొట్టుతీయని ధాన్యాలు తినడాన్ని ప్రోత్సహించాలని పేర్కొంది. దీంతోపాటు రవాణాలో కొరత కారణంగా పండ్లు, కాయగూరలను ఆరబెట్టి నిల్వచేసేందుకు డ్రైయ్యర్లను వినియోగించాలని సూచించింది. కొరతలో ఉన్న ధాన్యాలు, కూరగాయలను ఎంచుకొని రైతులు పండించాలని, యంత్రాలను వినియోగించి వృథాను కట్టడి చేయాలని పేర్కొంది. బయటకు చెబుతున్న దానికన్నా ఆ దేశంలో సమస్య తీవ్రంగా ఉందన్న విషయాన్ని ఇటీవల పరిణామాలు సూచిస్తున్నాయి.
వరదలతో దెబ్బతిన్న పంటలు..
దాదాపు ఏడాదిన్నర నుంచి చైనాలో ఆహార కొరత విషయమై (china food crisis news) తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ దేశ తీరప్రాంతాల్లో 1000 ఏళ్లల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో వరదలు వచ్చాయి. ఫలితంగా పంటలు దెబ్బతిన్నాయి. వాస్తవానికి 2019 నాటికి చైనాలో 23,841 డ్యామ్‌లు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న మొత్తం ఆనకట్టల్లో 41శాతానికి ఇది సమానం. వీటిల్లో అత్యధికంగా 2,000 సంవత్సరం తర్వాత నిర్మించినవే. కానీ , చైనాలో కుంభవృష్టి వర్షాలు ఎక్కువ అన్న విషయాన్ని మరచిపోయి.. ఈ ఆనకట్టల్లో నీటిని కిందకి వదల కుండా భారీగా నిల్వ ఉంచుతున్నారు. రాత్రికిరాత్రి కురిసే భారీ వర్షాలకు ఇవి పొంగి.. పంటలను, ఊళ్లను ముంచెత్తుతున్నాయి. గతేడాది త్రీగోర్జెస్ డ్యామ్ కారణంగా సిచువాన్‌లో వచ్చిన వరదలే దీనికి నిదర్శనం.
ఇక హేహీ టెంచాంగ్ రేఖకు తూర్పు ప్రాంతంలో 94శాతం చైనా జనాభా ఉంటుంది. ఆ భాగంలోని సిచువాన్ ప్రావిన్స్, షాంగ్జీ ప్రావిన్స్, హెనాన్ ప్రావిన్సులను ఇటీవల రికార్డు స్థాయి వరదలు ముంచెత్తాయి. ఫలితంగా పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కూరగాయల హోల్‌సేల్ రేట్లు రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. కొన్ని రకాల కూరగాయలను మాంసం కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఆస్ట్రేలియా పై అలిగితే ఏమయిందంటే..
చైనాలో అత్యధిక విద్యుదుత్పత్తి బొగ్గు ఆధారంగానే జరుగుతుంది. కానీ, ఆస్ట్రేలియాతో పలు అంశాలపై వివాదాల కారణంగా.. అక్కడి నుంచి బొగ్గు కొనుగోళ్లను నిలిపివేసింది. ఇది ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుందని చైనా ఆశించింది. కానీ, ఆ నిర్ణయంతో విద్యుత్తు కొరత రూపంలో డ్రాగన్‌కే షాక్ తగిలింది. నగరాల వీధుల్లో లైట్లు కూడా వెలగని పరిస్థితి నెలకొంది. దీంతో చైనాలోని డీజిల్ నిల్వలను విద్యుత్తు ఉత్పత్తికి మళ్లించింది. ఇది మరో రూపంలో చైనాలో సమస్యను సృష్టించింది. వాహనాలకు ఇంధన కొరత తలెత్తింది. ఇంధన విక్రయాలపై రేషన్ విధించాల్సిన పరిస్థితి వచ్చింది. అసలే ఆహార కొరత.. ఆపై రవాణా సౌకర్యాలకు తగినంత డీజిల్ లేకపోవడంతో ధరలు పెరిగాయి.
ఇటీవల డెల్టా వేరియంట్ చైనాలో విజృంభించడం మొదలు పెట్టింది. ఫలితంగా చాలా నగరాలు మళ్లీ కఠిన లాక్‌డౌన్ల వైపుగా ప్రయాణిస్తున్నాయి. ఇది కూడా ఆహార కొరతను తీవ్రం చేస్తోంది.
ఆహార పొదుపునకు చర్యలు..
చైనా సోషల్ మీడియాలో పోస్టు చేసే 'బింజ్ ఈటింగ్' (అతిగా తింటున్న) వీడియోలు చేసేవారిపై, ఆహారాన్ని వృథా చేసేవారిపై (china flooding food shortage) చర్యలు తీసుకోవడం మొదలు పెట్టినట్లు ఇటీవల బ్లూమ్‌బెర్గ్ పత్రిక పేర్కొంది. కంపెనీలు మీటింగ్‌ల పేరుతో విలాసవంతమైన భోజనాలను ఏర్పాటు చేయడాన్ని చైనా నిషేధించింది. 2025 నాటికి ప్రజలకు సంపూర్ణ ఆహార భద్రత ఇచ్చేందుకు అధ్యక్షుడు షీజిన్‌పింగ్ ప్రణాళిక సిద్ధం చేశారు. దీనిలో ఆహార వృథాను తగ్గించాలని స్పష్టంగా పేర్కొన్నారు. పందులు, కోళ్ల పెంపకంలో సోయాబీన్, మొక్కజొన్నను వాడకుండా ధాన్యాలను ప్రాసెస్ చేసినప్పుడు లభించే ఉప ఉత్పత్తులను వాడాలని రైతులకు సూచించింది. ఆహార పదార్థాలతో బయో ఇంధనాలు తయారు చేసే సంస్థలపై ఆంక్షలు విధించింది.
ఇదీ చదవండి:'మాకు వీడియో లింక్ పంపలేదు'.. కాప్26 గైర్హాజరుపై చైనా