కరోనాపై సమగ్ర సమాచారం అందించే అంశమై ఆలస్యం చేస్తోంది చైనా. ఈ నేపథ్యంలో చైనాలో పర్యటించి వైరస్ పుట్టుక, మానవుల్లో వ్యాప్తి చెందేందుకు గల కారణాలను విశ్లేషించాలని ఉద్దేశించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. వైరస్ పుట్టుకపై చైనా విడుదల చేసేకంటే ముందే సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేయాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలో వచ్చేవారంలో తమ బృందం వుహాన్లో పర్యటించనుందని వెల్లడించారు డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త డా. సౌమ్య స్వామినాథన్. మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయా విషయాలు వెల్లడించారు.
చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయం.. వుహాన్ మునిసిపల్ హెల్త్ కమిషన్ విడుదల చేసిన సమాచారాన్ని విశ్లేషిస్తోంది. వైరస్ మొదలయ్యే ముందు న్యూమోనియా లక్షణాలను అంచనా వేస్తోంది. మహమ్మారిపై అధ్యయనం చేసేందుకు జనవరిలో ఓ అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని చైనాకు పంపేందుకు ఒప్పందం కుదిరిందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ అధనోమ్ నాడు ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ బృంద పర్యటన ఖరారైంది.
మధ్యవర్తిగా.. ఏ ప్రాణైనా ఉందా అనే దిశగా
వైరస్ పుట్టుకపై ప్రత్యేక దర్యాప్తు జరగాల్సి ఉందని, వుహాన్లో పర్యటించే తమ బృందం చైనా ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు సౌమ్య స్వామినాథన్.
"ప్రస్తుతం జరగాల్సింది ఏమిటంటే.. డిసెంబర్ కంటే ముందు పరిస్థితులను అంచనా వేసే దిశగా పరిశోధన జరగాలి. వైరస్ జంతువుల నుంచి మానవుల్లోకి ఎలా ప్రవేశించిందో విచారించాలి. గబ్బిలాల నుంచి మానవులకు సోకడంలో ఏదైనా ప్రాణి మధ్యవర్తిగా వ్యవహరించిందా.. లేక నేరుగా మనుషులకే వచ్చిందా అనేది పరిశోధించాలి. గబ్బిలాల్లో కూడా నిఫా వైరస్ వచ్చింది. సార్స్ వైరస్ వ్యాప్తి సమయంలో ఒక ప్రాణి మధ్యవర్తిగా పనిచేసింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పరిశోధన జరగాల్సి ఉంది."
-సౌమ్య స్వామినాథన్, శాస్త్రవేత్త
డిసెంబర్ 31 నుంచే న్యూమోనియా కేసులు నమోదైనట్లు వెల్లడించారు సౌమ్య.
"చైనాలోని డబ్ల్యూహెచ్ఓ కార్యాలయం జనవరి 1న వైరస్ను గుర్తించింది. అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల మేరకు వైరస్ నియంత్రణ దిశగా చర్యలు చేపట్టాం. వైరస్ గురించిన ఏదైనా వార్త వస్తే అందరికీ సమాచారం ఇచ్చాం."
- సౌమ్య స్వామినాథన్
గబ్బిలాల్లో సాధారణమే..
కొవిడ్-19 వైరస్ గబ్బిలాల్లో సాధారణమైనదేనని వెల్లడించారు సౌమ్య స్వామినాథన్.
"వైరస్ ఎలా, ఎక్కడి నుంచి వచ్చింది అనే దాన్ని మించి మిగతా సమాచారం మా వద్ద లేదు. గబ్బిలాల్లో ఈ వైరస్ జన్యువులు అతి సాధారణమైనవి. గబ్బిలాల్లో కరోనా వైరస్లు ఉన్నాయని చూపే అనేక పరిశోధనలు ఆగ్నేయ ఆసియాలో జరిగాయి. దక్షిణ చైనా సహా ఆగ్నేయ ఆసియాలో నివసించే వారిలో కరోనా వైరస్లకు యాంటీబాడీలు ఉన్నట్లు పలు పరిశోధనలు పేర్కొన్నాయి."
- సౌమ్య స్వామినాథన్
ఇదీ చూడండి: దృష్టంతా కరోనా 1.0 కట్టడిపైనే: డబ్ల్యూహెచ్ఓ