ఆస్ట్రేలియా క్వీన్స్‌ల్యాండ్‌లోని ఓ శ్మశానం. కొంతమంది యువకులు ఉత్సాహంగా పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. 149 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ శ్మశానంలోని తమ పూర్వీకుల సమాధులకు మెరుగులు దిద్దుతున్నారు. కష్టమైనా లెక్కచేయకుండా ఈ పనికి సంకల్పించారు.
ఆస్ట్రేలియా క్వీన్స్‌ల్యాండ్‌లోని బ్రిస్బేన్ లో ఉందీ చారిత్రక శ్మశానం. 1870 లో ప్రారంభమైన ఈ శ్మశానం ప్రస్తుతం 20 వేల సమాధులకు నిలయంగా మారింది. ఈ చారిత్రక శ్మశానం భారీ వరదలనూ తట్టుకుని నిలబడింది. కానీ పూర్వ సౌందర్యాన్ని కోల్పోయి శిథిలావస్థకు చేరింది. దీనికి తోడు దశాబ్దాల నిర్లక్ష్యం, పురాతన కాలం నాటి సమాధులైనందు వల్ల అధ్వాన్నంగా మారాయి.
ఈ శ్మశాన వాటిక ఏర్పాటు చేసి వచ్చే ఏడాదికి 150 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో చారిత్రక శ్మశానానికి వచ్చే ఏడాదిలోగా పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టింది స్థానిక యువత.
'ఇక్కడి స్మారక స్థూపాల పైన "మరణించినా కానీ మర్చిపోలేదు" అని రాసి ఉంది.. అదే మేము చెప్పాలనుకుంది కూడా...మేము వాళ్లని మర్చిపోలేదని చెప్పేందుకే ఇలా చేస్తున్నాము.'
- ట్రాసీ ఓలివియెరి, సంస్థ సభ్యురాలు
ఈ శ్మశానం చాలా ఆహ్లాదకరమైన ప్రదేశమని, ఆటలూ ఆడుకోవచ్చని ఈ యువకులు అభిప్రాయపడుతున్నారు
కనిపిస్తున్న స్మృతుల చిహ్నాలను బ్రష్ తో రుద్ది, వాటిపై నీటిని వెదజల్లాలి..అలా తిరిగి చేస్తూనే ఉండాలి.
-జాక్ చెనోవెత్, స్వచ్ఛంద సేవకుడు
సమాధులను బాగు చేసేందుకు యత్నించడం వల్ల అక్కడి చరిత్రతో ప్రయాణించినట్లు అనిపిస్తుందని యువకులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:మాలీలో నరమేధం: 23 మంది ఊచకోత