లక్షలాది మంది ప్రజల ఘోషతో హాంగ్‌కాంగ్ వీధులన్నీ మార్మోగిపోయాయి. విచారణ నిమిత్తం తమ దేశ పౌరులను చైనాకు అప్పగించాలన్న బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ వీరంతా రోడ్డెక్కారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు ‘'హాంగ్‌కాంగ్ ఎప్పటికీ హక్కును వదులుకోదు'’ అనే ప్లకార్డులను ప్రదర్శించారు. 2014లో హాంగ్‌కాంగ్ ప్రజాస్వామ్య నిరసనల్లో భాగంగా నిర్వహించిన ‘'అంబ్రెల్లా మూమెంట్’' తర్వాత ఆ స్థాయిలో మళ్లీ నిరసనలు చెలరేగడం ఇదే ప్రథమం. మొత్తంగా ఇంత భారీ ఎత్తున ప్రజలు వీధుల్లోకి రావడం గత 15 ఏళ్లలో ఇదే తొలిసారి.
ఏంటి ఈ బిల్లు?
నేరపూరిత చర్యలకు పాల్పడ్డ తమ దేశస్తులను విచారణ నిమిత్తం అవసరమైతే చైనాకు అప్పగించేందుకు వీలుగా హాంగ్‌కాంగ్ ప్రభుత్వం బిల్లును తీసుకురావాలని చూస్తోంది.
ఎటుచూసినా నిరసనలు
ప్రభుత్వం తేవాలని భావిస్తోన్న ఈ బిల్లు హాంగ్‌కాంగ్ స్వతంత్ర న్యాయవ్యవస్థను దెబ్బతీసేలా ఉందని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు, న్యాయవాదులు, విద్యార్థులు, ప్రజాస్వామ్య సంఘాలు, మత సంఘాలు ఈ నిరసనల్లో పాల్గొన్నాయి. ఈ బిల్లును తీసుకురావడం సరికాదని, ఒకవేళ ఈ చట్టం వస్తే అది హాంగ్‌కాంగ్‌కు ‘ఎండ్ గేమ్' అవుతుందని మండిపడ్డారు.
తెరపైకి ఇలా...
హాంగ్‌కాంగ్‌కు చెందిన ఓ వ్యక్తి.. గర్భవతి అయిన తన ప్రియురాలిని తీసుకుని గతేడాది ఫిబ్రవరిలో తైవాన్‌కు వెళ్లాడు. అక్కడ ఆమెను హత్య చేసి, అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి హాంగ్‌కాంగ్ వచ్చేశాడు. అతడిని తమకు అప్పగించాలని తైవాన్ కోరింది. అయితే, నేరస్తుల అప్పగింతపై తైవాన్‌తో సరైన ఒప్పందాలు లేక హాంగ్‌కాంగ్ ఇందుకు నిరాకరించింది. ఈ అంశంపై ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యలో హాంగ్‌కాంగ్ ఈ బిల్లుని తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. అయితే, ఇందుకు ప్రజలు ససేమీరా అంటున్నారు. హాంగ్‌కాంగ్ హక్కులకు భంగం కలుగుతుందని చెబుతున్నారు.
అయితే, హాంగ్‌కాంగ్ పౌరులను చైనాకు అప్పగించాలనే బిల్లును జులై నెలలోపే తీసుకురావాలని ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
ఇదీ చూడండి : కిర్గిస్థాన్‌లో మోదీ, జిన్ పింగ్ భేటీ: చైనా