తమ దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో అమెరికా సైనిక బలగాలను ఉపసంహరించుకోవడం సహా ద్వైపాక్షిక అంశాలకు సంబంధించిన ఇతర విషయాలపై బైడెన్ సర్కార్‌తో ఇరాక్.. ఏప్రిల్ నెలలో వ్యూహాత్మక చర్చలను జరపనుంది. ఈ మేరకు ఇరాక్ అధ్యక్షుడు బర్హమ్ సాలి అమెరికాకు పంపిన అధికారిక మెమో అనంతరం.. ఈ ప్రకటన చేసింది అగ్రరాజ్యం.
ట్రంప్ పాలనలో గతేడాది జూన్‌లో ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే.. బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగే మొదటి సమావేశం ఇదే కానుంది. ఈ భేటీలో యూఎస్-ఇరాక్‌ల భవిష్యత్తు సంబంధాలను రూపొందించేందడమే లక్ష్యంగా చర్చలు జరపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. భద్రత, వాణిజ్యం, వాతావరణం వంటి అంశాలూ ఇందులో ముడిపడి ఉన్నాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ఇరాక్ రాజధాని బాగ్దాద్ విమానాశ్రయం వెలుపల ఇరానియన్ జనరల్ ఖాసీం సులేమాని, ఇరాక్ మిలీషియా నాయకుడు అబూ మహదీ-అల్ ముహందీలను గతేడాది జనవరిలో హతమార్చిన అనంతరం.. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఆ తర్వాత.. మేలో ముస్తఫా అల్-ఖాదిమి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు కాస్త మెరుగుపడ్డాయి. అయితే.. పార్లమెంటులో ఇరాన్ మద్దతు కలిగిన ఫతా కూటమి సహా మరికొన్ని పార్టీలు.. అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలని పట్టుబట్టాయి.
అమెరికన్ రక్షణ విభాగం(పెంటగాన్) ప్రకారం.. ఇరాక్‌లో యూఎస్ దళాల సంఖ్య గత నెలల్లో 2,500కు పడిపోయినట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: మాస్క్ పెట్టుకున్నందుకు చట్టసభ్యుడికి బెదిరింపులు!