సముద్రంలో మునిగిపోయిన తమ జలాంతర్గామిని గుర్తించేందుకు ఇండోనేసియా నావికాదళం గాలింపు ముమ్మరం చేసింది. ఐదు నౌకలు, ఓ హెలికాప్టర్ సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపింది. సముద్రాల్లో గాలింపు కోసం ఉపయోగించే అధునాతన సాంకేతికత ఉన్న ఓ సర్వే నౌకను రంగంలోకి దించుతున్నట్లు వెల్లడించింది. 600-700 మీటర్ల లోతుకు జలాంతర్గామి పడిపోయి ఉంటుందని నావికాదళం భావిస్తోంది.
కాగా.. జలాంతర్గామి గల్లంతైన ప్రాంతానికి 2.5 నాట్స్ దూరంలో నీటి కదలికలను గుర్తించినట్లు ఇండోనేసియా ఆర్మీ తెలిపింది. అయితే, అది సబ్‌మెరైనే అని నిర్ధరించేందుకు తగిన డేటా అందుబాటులో లేదని ఆర్మీ ప్రతినిధి అచ్మద్ రియాద్ పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో చమురు ఆనవాళ్లు, డీజిల్ వాసనను పలు నౌకలు గుర్తించాయని చెప్పారు. అయితే అది సబ్‌మెరైన్ ఇంధనమే అని చెప్పేందుకు ఆధారాలు లేవని అన్నారు.
భారత్ సహాయం
సరిహద్దు దేశాలు ఈ సెర్చ్ ఆపరేషన్‌కు సహకరిస్తున్నాయి. పలు దేశాలు తమ నౌకలను పంపిస్తున్నాయి. భారత్ సైతం ఇండోనేసియాకు అండగా నిలబడింది. జలాంతర్గామిని గుర్తించేందుకు డీప్ సబ్‌మెరైన్ రెస్క్యూ నౌకను రంగంలోకి దించింది. విశాఖపట్నం నుంచి ఈ నౌక బయలుదేరిందని భారత నావికా దళం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో ఉన్న అధునాతన సాంకేతికత.. గల్లంతైన జలాంతర్గాములను గుర్తిస్తుందని పేర్కొంది.
సింగపూర్, మలేసియా దేశాల నౌకలు శనివారం నాటికి ఇక్కడికి రానున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, టర్కీ దేశాలు సహాయం చేసేందుకు ముందుకొచ్చాయని ఇండోనేసియా నావికా దళం స్పష్టం చేసింది.
సహాయక బృందాలు వెళ్లని స్థితి!
సబ్మెరైన్లు 200 మీటర్ల కన్నా ఎక్కువ లోతుకు వెళ్తే మునిగిపోయే ప్రమాదం అధికంగా ఉంటుందని దక్షిణ కొరియా షిప్‌బిల్డింగ్, మెరైన్ ఇంజినీరింగ్ సంస్థ అధికారి ఆన్గుక్ హెయోన్ పేర్కొన్నారు. ఇండోనేసియాలోని చాలా వరకు జలాంతర్గాములను తమ సంస్థే ఆధునికీకరించిందని చెప్పారు. అయితే.. గల్లంతైన జలాంతర్గామికి సంబంధించి గత తొమ్మిదేళ్లలో ఎలాంటి పనులు చేపట్టలేదని, అందువల్ల దాని గురించి సమాచారం లేదని వివరించారు.
సహాయక బృందాలు చేరుకోలేని లోతైన ప్రాంతానికి సబ్‌మెరైన్ మునిగిపోయి ఉంటుందని ఆస్ట్రేలియా సబ్‌మెరైన్ ఇన్స్టిట్యూట్ కార్యదర్శి ఫ్రాంక్ ఓవెన్ పేర్కొన్నారు. సహాయక బృందాలు 600 మీటర్ల లోతు వరకే వెళ్లగలుగుతాయని చెప్పారు.
మునిగిపోయే సమయంలో జలాంతర్గామి 200 మీటర్ల లోతులో ఉందని సబ్‌మెరైన్ తయారు చేసిన సంస్థ వెల్లడించింది. ప్రమాదం జరిగిన జలాంతర్గామిలో 53 మంది ఉన్నారు. బాలీ తీరంలో నంగ్గల్ల-402 అనే జలాంతర్గామి బుధవారం గల్లంతైంది. టార్పిడోలను పరీక్షించే సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి- ప్రైవేటు ఆస్పత్రులకు అందని ఆక్సిజన్- ఎంపీ ఫిర్యాదు