మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్ధృతంగా మారాయి. ఈ క్రమంలో నిరసనకారులపై సైన్యం జరిపిన కాల్పుల్లో కనీసం 18 మంది పౌరులు మరణించగా, 30 మందికిపైగా గాయపడ్డారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందినట్లు ఐరాస మానవ హక్కుల విభాగం తెలిపింది.
దేశంలోని ప్రధాన నగరాలైన యాంగూన్, దావై, మాండలే సహా.. ఇతర నగరాల్లో ఆందోళనకారులపై పేలుడు పదార్థాలను ప్రత్యక్షంగా ప్రయోగించారని, ఫలితంగా.. మరణాలు సంభవించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడుల్లో బాష్పవాయువు, స్టన్ గ్రనేడ్లను ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఆందోళనకారులపై రోజురోజుకూ పెరుగుతోన్న హింసను తీవ్రంగా ఖండిస్తున్నట్టు మానవ హక్కుల విభాగం ప్రతినిధి రవినా శమదాసాని పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన చేపడుతోన్న పౌరులపై బలప్రయోగాన్ని వెంటనే నిలిపివేయాలని సైన్యానికి సూచించారు.
ఖండించిన హెచ్ఆర్డబ్ల్యూ..
మయన్మార్ సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలను అణచివేయడాన్ని మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ (హెచ్ఆర్డబ్ల్యూ) ఖండించింది. పౌరులపై భద్రతా దళాలు జరిపిన దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.
ప్రపంచమంతా.. మిలిటరీ అరాచకాలను గమనిస్తోందని, సైనిక చర్యలకు మయన్మార్ జవాబుదారీగా ఉండాలని హెచ్ఆర్డబ్ల్యూ ఆసియా డైరెక్టర్ ఫిల్ రాబర్ట్‌సన్ తెలిపారు.
ఇదీ చదవండి: మయన్మార్‌లో నిరసనకారులపై సైన్యం స్నైపర్ దాడులు