ప్రాణాంతక కరోనా వైరస్‌తో ప్రపంచం బెంబేలెత్తిపోతోంది. ఇప్పటికే అనేక వేడుకలు, ముఖ్య సమావేశాలు రద్దయ్యాయి. ఈ జాబితాలోకి ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ వార్షిక సమావేశం కూడా చేరింది.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశం ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. ఈ నెల 20 వరకు సమావేశం జరగాల్సి ఉంది. అయితే కరోనా విజృంభిస్తోన్న తరుణంలో.. శుక్రవారం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సమావేశాన్ని రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. సమావేశంలో పాల్గొన్న వారు దీనికి మద్దతు పలికారు. కరోనా వైరస్‌ను అంతర్జాతీయ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొన్న మరుసటి రోజే.. ఈ నిర్ణయం వెలువడింది.
మార్స్ మిషన్ వాయిదా
కరోనా ప్రభావం అంతరిక్ష పరిశోధనలపైనా పడింది. రష్యా- ఐరోపా సంయుక్తంగా చేపట్టిన మార్స్ మిషన్ వాయిదా పడింది. ప్రాణాంతక వైరస్‌తో పాటు సాంకేతిక లోపాలు కూడా ఇందుకు కారణమని రష్యా అంతరిక్ష సంస్థ ప్రకటించింది. 2022లో ఈ మిషన్ చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది.
స్పెయిన్‌లో రెట్టింపు..
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. స్పెయిన్‌లో దాదాపు 3 వేల కేసులు నమోదవగా మృతుల సంఖ్య 84కు చేరింది. కేవలం 24 గంటల వ్యవధిలో మృతుల సంఖ్య రెట్టింపవడం ఆ దేశ ప్రజలను కలవరపెడుతోంది.
కరోనా వల్ల పోలాండ్‌లో తొలి మరణం సంభవించింది. దేశంలో మరో 46 మంది వైరస్ బారిన పడ్డారు.
విద్యాసంస్థలు బంద్...
అంతర్జాతీయ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మూతపడుతున్నాయి. ఈ జాబితాలోకి ఐర్లాండ్, శ్రీలంక కూడా చేరాయి. ఐర్లాండ్‌లో 43 కరోనా కేసులు నమోదుకాగా, ఒకరు మృతి చెందారు.
శ్రీలంకలో అన్ని విద్యాసంస్థలు ఏప్రిల్ 20 వరకు మూసివేస్తున్నట్లు ఆ దేశ విద్యాశాఖ ప్రకటించింది. ఇటీవల శ్రీలంకలో రెండో వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది.