Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రష్యా ప్రభుత్వంపై కఠిన ఆంక్షలు విధిస్తూ వచ్చిన అగ్రరాజ్యం.. ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్‌పై వ్యక్తిగత ఆంక్షల బాణాలను ఎక్కుపెట్టింది. ఉక్రెయిన్‌పై దాడికి వీరివురే బాధ్యులని ఆరోపించింది.
ఈ విషయంలో అమెరికా.. ఐరోపా సమాఖ్యను అనుసరించింది. పుతిన్‌తో పాటు లావ్రోవ్‌ల ఆస్తులను స్తంభింపజేసేందుకు ఈయూ శుక్రవారమే నిర్ణయించింది. ఈ రెండో విడత ఆంక్షలకు 27 దేశాల ఈయూ విదేశాంగ మంత్రుల సమావేశం ఆమోదం తెలిపింది. ఇలా అగ్రరాజ్యం ఓ దేశాధినేతపై నేరుగా ఆంక్షలు విధించడం చాలా అరుదు. గతంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, బెలారస్ అధ్యక్షుడు లుకషెంకా, సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌పై ఈ తరహా ఆంక్షలు అమలు చేసింది.
Russia Attack Ukraine: రష్యా రక్షణ మంత్రి సెర్టీ షోయిగు, రష్యా చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరసిమోవ్‌పై కూడా అమెరికా ఆంక్షల కొరడా ఝుళిపించింది. ఇప్పటికే రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లోని 11 మంది ఉన్నతాధికారులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలిసినప్పటికీ.. పుతిన్ ఆక్రమణ దిశగా అడుగులు వేశారని అమెరికా భావిస్తున్నట్లు శ్వేతసౌధం ప్రతినిధి జెన్ సాకీ తెలిపారు. ఇది పూర్తిగా పుతిన్ నిర్ణయమేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యావత్తు ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చి రష్యా చర్యలను వ్యతిరేకించాల్సిన బాధ్యత అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై ఉందని వ్యాఖ్యానించారు.
అమెరికా సహా ఇతర దేశాలు విధిస్తున్న కఠిన ఆంక్షలతో రష్యా తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందని సాకీ అన్నారు. అలాగే, అంతర్జాతీయ సమాజంలో దౌత్యపరంగా, ఆర్థికంగా ఒంటరి అవుతుందని అభిప్రాయపడ్డారు. పుతిన్‌పై నేరుగా ఆంక్షలు విధించడంతో రష్యా దురాక్రమణను నిలువరించడంతో పాటు, ఐరోపాలో పెద్దయుద్ధం జరగకుండా ఆపే దిశగా ముందుకెళుతున్నట్లు పాశ్చాత్య దేశాలు సంకేతాలిచ్చినట్లయింది.
ఆంక్షలు విధిస్తే ఏమౌతుంది?
Russia Ukraine Crisis News: ఇలా కొందరు వ్యక్తులపై ఆంక్షలు విధించడం వల్ల వారి ప్రయాణాలపై నిషేధం ఉంటుంది. అలాగే కంపెనీలు వీరితో ఎలాంటి లావాదేవీలు జరపడానికి ఆస్కారం ఉండదు. బ్యాంకులు, స్కూళ్లు సహా ఇతర ఏ కంపెనీలు వీరితో ఒప్పందాలు చేసుకోవడానికి వీలుండదు. అలాగే విదేశాల్లో ఉన్న వీరి ఆస్తులను స్తంభింపజేస్తారు. పుతిన్‌పై అమెరికా నేరుగా ఆంక్షలు విధిస్తే రాజకీయంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు వినాశనకరంగా మారుతాయని ఇప్పటికే ఆయన అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు. అయినప్పటికీ.. అమెరికా ఈ విషయంలో ముందడుగు వేసింది.
పుతిన్‌పై ప్రభావమెంత?
U.S. Sanctions On Russia: అయితే, ఈ ఆంక్షలు పుతిన్‌పై ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పుతిన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడని.. ఆయన ఆస్తుల విలువను అంచనా వేయడం కూడా కష్టమని గతంలో ఆయన ఆంతరంగికుల్లో ఉన్న కొందరు తెలిపారు. పైగా వాటిపై ఆంక్షల ప్రభావం లేకుండా ఆయన ముందే జాగ్రత్త వహించారని పేర్కొన్నారు. పుతిన్ ఆస్తుల విలువ దాదాపు 200బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని రష్యా నుంచి బహిష్కరణకు గురైన బిల్ బ్రౌడర్ 2017లో అమెరికా సెనేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. రష్యా పరిధిలోకి వచ్చే ప్రతి ఆస్తిని ఆయన తనదిగానే భావిస్తారని ఆయన ఆంతరంగికుల్లో ఒకరైన సెర్గీ పుగచెవ్ 2015లో గార్డియన్‌కు తెలిపారు. ఆయన ఆస్తుల్ని లెక్కించడం కూడా సాధ్యం కాదన్నారు. అధికారికంగా మాత్రం 1,40,000 డాలర్ల వేతనం, మూడు కార్లు, 800 చదరపు అడుగుల భవంతిని మాత్రమే తన ఆస్తిగా చూపిస్తారన్నారు. ఆయన ఆస్తులు దేశంలోని సహజ వనరుల రూపంలోనూ ఉన్నాయని తెలిపారు. కాబట్టి ఆంక్షల ప్రభావం పుతిన్ ఆస్తులపై పెద్దగా ఉండదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'స్విఫ్ట్' అస్త్రం ప్రయోగిస్తే.. రష్యాకు జరిగే నష్టం ఏంటి?
Russia Ukraine War: చెర్నోబిల్‌పై రష్యా మెరుపుదాడి.. అందుకేనా?