Ukraine Crisis: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రసాయన ఆయుధాల వినియోగానికి రష్యా తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం అన్నారు. ఉక్రెయిన్‌లో రష్యాపై అమెరికా యుద్ధం చేయబోదని చెప్పారు. నాటో, రష్యా మధ్య ప్రత్యక్ష ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని అన్నారు.
"మేము ఐరోపాలోని మా మిత్రదేశాల కోసం కలిసి పోరాడతాం. యునైటెడ్ స్టేట్స్ పూర్తి శక్తితో నాటో భూభాగంలోని ప్రతి ఒక్క అంగుళాన్ని రక్షించుకుంటాం. ఉక్రెయిన్‌లో రష్యాపై యుద్ధం చేయబోము. నాటో, రష్యా మధ్య ప్రత్యక్ష ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధమే. ఇది జరగకుండానే మనం ప్రయత్నించాలి."
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
ఉక్రెయిన్‌లో రష్యా ఎప్పటికీ విజయం సాధించదని బైడెన్ అన్నారు. పోరాటం లేకుండానే ఉక్రెయిన్‌పై ఆధిపత్యం చెలాయించాలని రష్యా ఆశించింది.. కానీ విఫలమయ్యిందని చెప్పారు. ఉక్రెయిన్ సమస్యపై అమెరికా, ప్రపంచం ఐక్యంగా ఉన్నాయని ఆయన అన్నారు. చక్రవర్తులు ప్రపంచ గమనాన్ని నిర్ధేశించలేరు.. ప్రజాస్వామ్య దేశాలన్ని ఇందుకు ఏకతాటిపై ఉన్నాయని చెప్పారు. రష్యాకు వీటో అధికారాన్ని రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై ఆగని రష్యా దాడులు.. నగర వీధుల్లో మృతదేహాల దిబ్బలు!