పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో కీలక నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి బ్రిటన్ సూచనప్రాయంగా అంగీకరించింది. నీరవ్ మోదీని తమకు అప్పగించాలని భారత్ చేసిన విజ్ఞప్తిపై న్యాయప్రక్రియ ప్రారంభించింది.
మరో రెండు రోజుల్లో నీరవ్ మోదీ కేసును లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ న్యాయస్థానం ముందు ఉంచుతామని బ్రిటన్ హోంమంత్రి సాజిద్ జావేద్ కార్యాలయం నుంచి ఈడీకి సమాచారం అందింది.
త్వరలోనే ఈడీ, సీబీఐ అధికారులు కలిసి లండన్ వెళ్లి, నీరవ్ మోదీ నేరాలపై అక్కడి న్యాయస్థానంలో సాక్ష్యాలు సమర్పించనున్నారు. మరో బ్యాంకు కుంభకోణ నిందితుడు విజయ్‌మాల్యా కేసులోనూ సాక్ష్యాధారాలు అందజేస్తారు.
ఘరానా మోసగాళ్లు....
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నీరవ్ మోదీ, అతని మామ మెహుల్ చోక్సీ, కొందరు బ్యాంకు అధికారులు నిందితులుగా ఉన్నారు. వీరిపై ఈడీ, సీబీఐలు అక్రమ నగదు చలామణి కేసు నమోదు చేశాయి. వెంటనే వీరు దేశం విడిచి పారిపోయారు. వీరిని భారత్‌కు రప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నీరవ్ కోసం ఇప్పటికే ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసింది.