Typhoon Rai In Philippines: ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేసిన భీకర తుపాను రాయ్.. ధాటికి మరణించిన వారి సంఖ్య 375కు చేరింది. ఒక్క బోహోల్ రాష్ట్రంలోనే 100కు పైగా మరణాలు నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తుపాను ప్రభావంతో ఇప్పటివరకు 56 మంది ఆచూకీ గల్లంతు, 500 మందికి గాయాలు దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మందిపై తుపాను ప్రభావం పడింది. వేలాది ఇళ్లు, భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెట్లు, ఇళ్ల పైకప్పులపై ప్రజలు బిక్కుబిక్కుమంటూ తలదాచుకునే పరిస్థితి రాయ్ తుపాన్ తీసుకొచ్చింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టారు అధికారులు. తుపాను ప్రభావంతో గంటకు195-270 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని ఫిలిఫ్పీన్స్ వాతావరణశాఖ పేర్కొంది. దినాఘట్ ద్వీపం గవర్నర్ ఆర్లీన్ బాగో.. ఈ తుపానును అత్యంత ప్రమాదకరమైనదిగా అభివర్ణించారు. దినాఘట్తో పాటు పలు రాష్ట్రాలపై తుపాను రాయ్ తీవ్ర ప్రభావం చూపిందని ఆర్లీన్ బాగో అన్నారు. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి 4లక్షల మందికిపైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాటికన్లోని పోప్ ఫ్రాన్సిస్.. తుపాను ప్రభావంతో మృతిచెందినవారికి సంఘీభావం తెలిపారు. ఇదీ చూడండి: ఫిలిప్పీన్స్ తుపాను విలయంలో 208కు చేరిన మృతులు