పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌నకు స్వదేశంలోనే చేదు అనుభవం ఎదురైంది. షరీఫ్‌కు హృద్రోగ ప్రత్యేక అంబులెన్సు సేవలను అందించేందుకు రెండు ప్రభుత్వ ఆసుపత్రులు నిరాకరించాయి. గత కొంతకాలంగా లాహోర్ జైలులో అవినీతి కేసులో శిక్ష అనుభవిస్తున్నారు షరీఫ్.
అత్యవసర సమయంలో మాజీ ప్రధానిని ఆసుపత్రికి తరలించేందుకు వీలుగా కారాగారం వద్ద ఒక అంబులెన్సును ఏర్పాటు చేయాలని పాక్ పంజాబ్ రాష్ట్ర జైళ్ల విభాగం వారు ఆరోగ్య శాఖ అధికాలను కోరారు. జైళ్ల శాఖ వారి అభ్యర్థన మేరకు ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో సరైన సౌకర్యాలు లేవని అధికారులు గుర్తించారని డాన్ పత్రిక పేర్కొంది.
గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొనేందుకు వీలుగా రూపొందించిన ప్రత్యేక అంబులెన్సును ఏర్పాటు చేయాలని అధికారులు కోరగా... ఈ అభ్యర్థనను ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది.
"వీఐపీలు, వీవీఐపీలు, విదేశీ ప్రతినిధులు, రాష్ట్ర అసెంబ్లీ నేతలు, న్యాయమూర్తులు, ఆయా ప్రముఖుల కుటుంబాల సేవలో అంబులెన్సులు ఉన్నందున వైద్య బృందాలపై అధిక భారం పడుతోంది."
- పాక్ వైద్య వర్గాలు
అంబులెన్సుల కొరత ఉందని, జైళ్ల శాఖ అధికారుల అభ్యర్థన మేరకు అంబులెన్స్ కేటాయించలేమని పంజాబ్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ కార్టియాలజీ సమాధానమిచ్చింది.
పనామా పేపర్స్ విడుదల చేసిన అవినీతి నేతల జాబితాను అనుసరించి షరీఫ్‌పై దర్యాప్తు జరిగింది. 2017 జులై 28న పాక్ సుప్రీంకోర్టు... పనామా లీక్స్ ఆరోపించిన మూడు అవినీతి వ్యవహారాల్లోని ఒక దానిలో షరీఫ్‌ను దోషిగా తేల్చి... ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 2018 డిసెంబర్ 24 నుంచి ఆయన లాహోర్‌లోని కోట్ లక్పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
ఇదీ చూడండి: ఎయిర్‌సెల్ కేసులో చిదంబరానికి స్వల్ప ఊరట