పర్యటక రంగంలో అత్యుత్తమంగా వెలుగొందిన శ్రీలంకకు ఈస్టర్ ఉగ్రదాడులు ఆర్థిక కష్టాలు తెచ్చిపెట్టాయి. ఉగ్ర మారణకాండతో విదేశీ యాత్రికులు సంఖ్య భారీగా తగ్గింది. ఇప్పటికే హోటల్స్ బుక్ చేసుకున్నవారూ రద్దు చేసుకుంటున్నారు. హోటల్ ఆక్యుపెన్సీ దాదాపు 90 శాతం తగ్గిపోయింది. బీచ్‌లు, రెస్టారెంట్లు, దుకాణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం పర్యటకుల సంఖ్య 80 శాతం తగ్గిపోయింది.
అత్మాహుతి దాడులు ప్రాణాలను మాత్రమే బలిగొనలేదు. పర్యటకంపై ఆధారపడ్డ లక్షల మంది జీవితాలను రోడ్డున పడేసింది. శ్రీలంక అంతర్గత యుద్ధం తర్వాత ఇదే అత్యంత దారుణమైన స్థితి అని అధికారులు చెబుతున్నారు.
వ్యాపారాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు హోటల్ యజమానులు. విదేశీయుల భద్రతపై భరోసా కల్పించేందుకు యత్నిస్తున్నారు.
"మేం తిరిగి కోలుకుంటున్నాం. పరిస్థితి అదుపులోనే ఉందని భావిస్తున్నాం. హోటల్‌కు వస్తున్న యాత్రికులు క్షేమంగా ఉన్నారు. మా సిబ్బంది ఇంతకుముందుకన్నా అప్రమత్తంగా ఉన్నారు. గత తప్పుల నుంచి చాలా నేర్చుకున్నాం. మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది."
-లంకేశ పొన్నంపెరుమా, హిక్కా ట్రాన్జ్ హోటల్ జీఎం, కొలంబొ
"ఇలాంటి ఉగ్రదాడులు చాలా దేశాల్లో జరిగాయి. బాలి, ఇండియా, ఫ్రాన్స్, బ్రిటన్. అయినా అక్కడికి ప్రజలు వెళుతున్నారు. సెలవులు గడుపుతున్నారు. అందుకే నేను చెబుతున్నా... ప్రభుత్వం, భద్రతా బలగాలు ప్రజలకు భరోసా ఇవ్వాలి. దేశ ప్రజలు, యాత్రికులకు నమ్మకం కలిగితేనే అది సాధ్యం."
-అనుషా ఫ్రిడ్మాన్, లవంగ రిసార్ట్ అండ్ స్పా ఎండీ, హిక్కాడువా
25 లక్షల మందికి ఆధారం
శ్రీలంక జీడీపీలో పర్యటకం ద్వారా వచ్చే ఆదాయం 4.9 శాతం. గతేడాది 23 లక్షల మంది విదేశీయులు వచ్చారు. 4.4 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. ఈ రంగంపై ప్రత్యక్షంగా 5 లక్షల మంది, పరోక్షంగా 20 లక్షల మంది ఆధారపడ్డారు.
పర్యటక రంగాన్ని కష్టాల నుంచి బయటపడేసేందుకు శ్రీలంక ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ప్రత్యేక ప్యాకేజీలు, పన్ను తగ్గింపులపై నిర్ణయం తీసుకుంది. దేశంలో పర్యటిస్తున్న యాత్రికులకు ఏదైనా ప్రమాదంలో మరణించినా, గాయపడినా 100 మిలియన్ డాలర్ల బీమా కల్పించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది.
ఇదీ చూడండి: శ్రీలంక ఉగ్రదాడి మృతుల సంఖ్య 310