త్రీగోర్జెస్ డ్యామ్.. చైనాకు కలికితురాయి! మానవులు సృష్టించిన అతిపెద్ద నీటి నిల్వ. ఇక్కడ యాంగ్జీ నదిలో నీటి నిల్వ దెబ్బకు భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకన్లు తగ్గిపోయింది. అంతరిక్షం నుంచి సాధారణ కంటికి కనిపించే అతితక్కువ కట్టడాల్లో ఇది కూడా ఒకటి. ఈ డ్యామ్‌లో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తు 22,500 మెగావాట్లు. అంటే ప్రపంచంలోనే అతి పెద్దవైన మూడు అణువిద్యుత్తు కేంద్రాల ఉత్పత్తికి దాదాపు సమానం. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు చూస్తే వణుకు పుట్టక మానదు.
ఈ డ్యామ్ నీటి నిల్వ కారణంగా భూమి అడుగున ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇక్కడ వరద పెరిగిన సమయంలో దిగువకు విడుదల చేసే నీటి దెబ్బకు లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. భారీగా పంటలు మునిగిపోతున్నాయి. ఒక సారి డ్యామ్ బద్దలై లక్షల మంది మరణించిన చరిత్ర చైనాకు ఉంది. ఈ సారి అదే పునరావృతం అవుతుందేమోనని ఆందోళన పడుతోంది.
చరిత్రలో ఎన్నడూ లేనంత వరద..
ఏప్రిల్ - సెప్టెంబర్ వర్షాకాలం చైనాకు చుక్కలు చూపిస్తోంది. ఈ ఏడాది యాంగ్జీ నది బేసిన్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదిలోకి ఎన్నడూలేనంతగా వరద వస్తోంది. 2003లో ఈ డ్యామ్ పూర్తైన తర్వాత ఎన్నడూ లేనంత స్థాయిలో నీరు చేరింది. గురువారం ఉదయం 8 గంటల నాటికి సెకన్‌కు 73,000 క్యూబిక్ మీటర్ల ఇన్‌ఫ్లో వస్తోంది. ఈ విషయాన్ని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ డ్యామ్ చరిత్రలోనే ఇది అత్యధికం. ఈ డ్యామ్‌పై భాగంలోని మూడు మరో డ్యామ్‌లు కూడా దీని ఆధీనంలోనే ఉంటాయి.
ఇక్కడ వందేళ్లలో ఒక సారి వచ్చే వరదల తీవ్రత ఎంతగా ఉంటుందంటే 244 బిలియన్ క్యూబిక్‌మీటర్ల నీరు వస్తుంది. ఇది ఇజ్రాయెల్ వద్ద మృత సముద్రంలోని నీటికి రెండింతలు. ఈ వరదలో కేవలం 9 శాతం మాత్రమే ఈ డ్యామ్‌లో నిల్వ చేయగలరు. అంటే మిగిలిన నీరు రెండు మూడు నెల్లలో కిందకు వదలాల్సిందే.! ఈ నదీ పరివాహక ప్రాంతంలో దాదాపు 40 కోట్ల మంది చైనీయులు నివసిస్తున్నారు. ఇది అమెరికా జనాభా కంటే ఎక్కువ. ఈ నెలలో 9 కోట్ల మంది వరదకు ప్రభావితమయ్యారు. 2.5లక్షల ఎకరాలు నీటమునిగిపోయాయి. జూన్ నుంచి ఇప్పటి వరకు పలు మార్లు డ్యామ్ గేట్లను ఎత్తారు. అయినప్పటికీ నీటి మట్టం ఏమాత్రం తగ్గడంలేదు. డ్యామ్ నిండుకుండను తలపిస్తోంది.
లక్షల మంది నిరాశ్రయులు..
వారం రోజులుగా ఇక్కడ వరద బాగా పెరిగిపోయింది. యాంగ్జీ పరివాహక ప్రాంతంలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉన్న 71 మీటర్ల బుద్ధ విగ్రహం కాళ్లను నది నీళ్లు తాకాయి. 1949 తర్వాత ఈ స్థాయికి నీరు ఎప్పుడూ చేరలేదు. ఇప్పటికే దాదాపు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీనికి తోడు డ్యామ్ వద్ద భారీగా నీరు నిలవడంతో బ్యాక్ వాటర్ ప్రాంతలు కూడా నీటమునిగాయి.
భూకంపాల హాట్‌జోన్‌లో నిర్మాణం..
ఈ డ్యామ్ నిర్మాణంపై మొదటి నుంచి పర్యావరణవేత్తలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని నిర్మిస్తున్న ప్రదేశం భూకంపాలకు అత్యంత అనువైంది. ఇక్కడ 2003 నుంచి ఇప్పటి వరకు 3,429 భూకంపాలు నమోదైనట్లు చైనా భూకంపాల అధ్యయన కేంద్రం పేర్కొంది. మరోపక్క భారీ వరదతోపాటు కొట్టుకొచ్చే బురద వెనుక భాగాన చేరడంతో డ్యామ్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటి వరకు డ్యామ్‌పై అధికారులు 80 భారీ బీటలను కనుగొన్నారు. ఈ డ్యామ్ నిర్మాణం కోసమే 114 పట్టణాలను, 1,680 గ్రామాలను చైనా నేల మట్టం చేసింది. ఫలితంగా 14 లక్షల మందికి పునరావసం కల్పించారు. ఇంత చేసినా డ్యామ్ అనుకున్న స్థాయి ఫలితాలు చైనాకు ఇవ్వడంలేదు. యాంగ్జీ నదికి వరదలు వచ్చిన ప్రతిసారీ లక్షల మంది నిరాశ్రయులు అవుతూనే ఉన్నారు. వరద తీవ్రత పెరిగి ఈ డ్యామ్‌కు ఎటువంటి ప్రమాదం జరిగినా దిగువ ప్రాంతాలకు వినాశనం తప్పదు. ఇంత పెద్ద డ్యామ్ నిర్మించినా చైనా దాహం తీరలేదు. 2019 నాటికి 23,841 డ్యామ్‌లు చైనాలో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న వాటిల్లో 41శాతానికి ఇది సమానం. వీటిల్లో అత్యధికంగా 2,000 సంవత్సరం తర్వాత నిర్మించినవే.
గతంలో డ్యామ్ ప్రమాదాలు..
చైనాలో డ్యామ్‌లు కుప్పకూలడం కొత్తేమీ కాదు. ఇక్కడ 1975 ఆగస్టులో యల్లో నదిపై బాన్‌క్యో డ్యామ్ కుప్పకూలింది. వాస్తవానికి ఈ డ్యామ్ ఎత్తును ఇష్టానుసారం పెంచడమే ప్రమాదానికి దారి తీసింది. ఈ ప్రమాదంలో లక్షల మంది మరణించినట్లు చెబుతారు. అనధికారిక లెక్కల ప్రకారం మృతల సంఖ్య 2.4లక్షలు. చైనా అంకెలు మాత్రం వేలల్లోనే ఉంటాయి. ఈ డ్యామ్ కూలడంతో చరిత్రలోనే మూడో అతిపెద్ద వరదలు సంభవించాయి. 30 నగరాల్లోనే 1.15 కోట్ల మంది దీని దెబ్బకు నిరాశ్రయులయ్యారు. 12వేల చదరపు కిలోమీటర్లు నీటమునిగాయి.
త్రీగోర్జెస్ డ్యామ్ ప్రారంభించిన ఏడాదే కొండచరియలు విరిగి పడి 24 మంది మరణించారు. ఇప్పుడు వరదలు ఎన్నడూ ఎదుర్కోని స్థాయిలో వస్తున్నాయి. ఏమాత్రం ప్రతికూల పరిస్థితులు తలెత్తినా చైనాలో జలప్రళయం తప్పదు.
ఇదీ చదవండి: చైనా ఆర్మీ వంటశాలల్లో రోబోల నియామకం!