లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం(ఎల్టీటీఈ)తో జరిగిన భీకర యుద్ధంపై శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తొలిసారి స్పందించారు. పదేళ్ల క్రితం జరిగిన యుద్ధంలో గల్లంతైన దాదాపు 20వేల మంది మరణించినట్టు అంగీకరించారు.
దర్యాప్తు ముగిసిన అనంతరం గల్లంతైన వారి మరణ ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తామని యూఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ హనా సింగర్‌కు అధ్యక్షుడు స్పష్టం చేసినట్టు ప్రముఖ వార్తా పత్రిక ది కొలంబో గెజిట్ పేర్కొంది.
మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని రాజపక్స తెలిపినట్టు అధ్యక్షుడి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
"మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన అనంతరం వారి కుటుంబాలకు అండగా ఉంటాం. తగిన సహాయం చేస్తాం. అయితే తమిళ రాజకీయ నేతలకు ఇది నచ్చకపోవచ్చు. కానీ బాధిత కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుంది."
--- అధ్యక్షుడి కార్యాలయం.
తమిళులతో 30ఏళ్ల పాటు సాగిన పౌర యుద్ధాన్ని తెరదించిన వీరుడిగా గొటబాయకు పేరుంది. ఎల్టీటీఈతో యుద్ధంలో తమిళుల మరణాలు, తమిళ కుటుంబాలు అదృశ్యం కావటం వంటివి ఈ మాజీ రక్షణ కార్యదర్శిపై ఉన్న ఆరోపణలు.
ఉత్తర-ఈశాన్య లంకలో తమిళులపై జరిగిన యుద్ధంలో లక్ష మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీనితో పాటు అనేక గొడవల్లో దాదాపు 20వేల మందికిపైగా ప్రజలు గల్లంతైనట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
2009లో ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరన్‌ను ప్రభుత్వ దళాలు మట్టికరిపించిన సమయంలో వేలాది మందిపై హత్య జరిగినట్టు తమిళులు ఆరోపించారు. వీటిని ప్రభుత్వం ఖండించింది.