ప్రపంచమంతటా కల్లోలం రేపుతున్న కొవిడ్ మహమ్మారి ఇటీవల కాలంలో యువతనూ చుట్టుముడుతోంది. దీంతో వైరస్‌ను తేలిగ్గా తీసుకోవద్దంటూ యువతను ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా ముప్పు వృద్ధుల్లోనే ఎక్కువగా ఉంటుందన్న ప్రచారం బాగా జరగడంతో యువత తమకేమీ కాదన్న భావనతో ఉండటం సరికాదని గట్టిగా చెబుతున్నారు. కచ్చితంగా జాగ్రత్తలు పాటించి తీరాల్సిందేనని ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అమెరికాలో..
ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో యువతలో కొవిడ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వైద్యుల వద్దకు వస్తున్న వ్యాధిగ్రస్థుల్లో వీరి సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా ఆరిజోనా, టెక్సాస్, ఫ్లోరిడా సహా హాట్‌స్పాట్ రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో గురువారం నాటికి 27.80 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా వీరిలో క్రమేపీ యువత శాతం పెరుగుతోంది. వాణిజ్య కార్యకలాపాల పునరుద్ధరణ; ఇళ్లకే పరిమితం కావాలన్న నిబంధనలు ఎత్తివేయడం; బార్లు, రెస్టారెంట్లు తెరుస్తుండటం; గ్రాడ్యుయేషన్ పార్టీలు; జాగ్రత్తలు పాటించకుండా ఒకేచోట గుమిగూడటం వంటి కారణాల వల్లే అమెరికాలో యువత ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనిపట్ల వైద్యులే ఆందోళన చెందుతున్నారు. యువతలో కేసులు పెరుగుతుంటే వారిద్వారా వ్యాప్తి ఎక్కువవుతుందని.. దీంతో వృద్ధులకు, దుర్బల పరిస్థితుల్లో ఉన్నవారికి మరింత ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
- ఆరిజోనాలో మే మధ్య (ఇంటివద్దే ఉండాలన్న నిబంధన ఎత్తివేసినప్పటి) నుంచి 20-44 ఏళ్ల మధ్య వయసున్న వారు ఎక్కువగా కొవిడ్ బారిన పడి ఆసుపత్రులకు వెళుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా కూడా మారుతోంది. ఆక్సిజన్, వెంటిలేటర్ల అవసరం కూడా పడుతోందని వైద్యులు చెబుతున్నారు. యువత జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి కేసుల సంఖ్య అమాంతం పెరుగుతుందని.. ఆసుపత్రుల్లో సామర్థ్యానికి మించి కేసులు వచ్చే ప్రమాదం ఉంటుందని, దీంతో రాష్ట్రాలు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌లకు వెళ్లే పరిస్థితి కూడా ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఆరిజోనాలో 80వేలకు పైగా కేసులు నమోదు కాగా ఇందులో దాదాపు సగం మంది 20-44 ఏళ్ల వయసువారున్నట్లు చెబుతున్నారు. దీంతో నైట్ క్లబ్‌లు, బార్లు ఈ వారం మూసివేశారు. యువత ఇళ్లకే పరిమితం కావాలని ఇక్కడి గవర్నర్ విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మార్చి ఆఖరు, జూన్ చివరి నాటికి పరిస్థితులను పరిశీలిస్తే కొత్త కేసులకు సంబంధించి సగటు వయసు 51 నుంచి 38కి తగ్గింది.
- ఫ్లోరిడాలో యువత కొవిడ్ బారిన పడుతున్న కేసులు అమాంతం పెరిగినట్లు గవర్నర్ తెలిపారు. రాష్ట్రంలో బార్ల వద్ద ఆల్కాహాల్ సేవించడంపై నిషేధం విధించారు. ఫ్లోరిడాలో లక్షా 55 వేలకు పైగా కేసులుండగా.. ఇటీవల సగటున 30-37 ఏళ్ల వయస్కులు ఎక్కువగా కొవిడ్ బారిన పడుతున్నట్లు ఫ్లోరిడా అంతర్జాతీయ విశ్వవిద్యాలయం అంటువ్యాధుల నిపుణులు తెలిపారు. ఇక్కడ వైరస్ వ్యాప్తికి ఎక్కువగా బార్లు కారణమవుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఇళ్లకే పరిమితం కావాలన్న నిబంధనలు ఎత్తివేయడంతో చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని.. తాము ఇక సురక్షిత వాతావరణానికి వచ్చేసినట్లు ఎక్కువమంది భావిస్తున్నారని చెబుతున్నారు.
- టెక్సాస్‌లో లక్షా 75 వేలకు పైగా కేసులున్నాయి. ఇటీవల యువత ఎక్కువగా కొవిడ్ బారిన పడుతున్నారు. బార్లు తెరవడానికి అనుమతించి నెల రోజులు కాగా.. తాజాగా వాటిని మూసివేస్తూ ఆదేశాలిచ్చారు. అలాగే రెస్టారెంట్లలో పరిమితిని కూడా 50 శాతానికి తగ్గించారు. యువతలో చాలామంది భౌతిక దూరాన్ని పాటించడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయమై అధికారులు తక్షణ చర్యలు చేపట్టకపోతే యువతలో కేసులు, ఇన్‌ఫెక్షన్లు, ఆసుపత్రుల్లో చేరడం, మరణాలు అనూహ్యంగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది?
కరోనా వైరస్ వృద్ధులకే తీవ్ర ప్రభావం చూపుతోందని భావించడం తప్పు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.ఇటలీలో కొవిడ్ బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురై ఐసీయూల్లో చేరిన వారిలో 10-15 శాతం 50 ఏళ్ల లోపు వారేనని తెలిపింది. ఐరోపాలోని పలు దేశాల్లో యువత చాలామంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. చాలామంది దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది.
భారత్‌లోనూ పెరుగుతున్న కేసులు..
భారత్‌లోనూ 'అన్‌లాక్1.0' తర్వాత యువతలో.. ప్రత్యేకించి 45 ఏళ్ల లోపువారిలో కేసులు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో గత నెల రోజుల్లో ఈ వయసుకు చెందిన కొవిడ్ బాధితుల సంఖ్య 40శాతం పెరిగినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. భారత్‌లో నిబంధనలు సడలించిన అనంతరం ఉపాధి కోసం యువత బయటకు రావడం, భౌతికదూరం పాటించకుండా.. మాస్కులు లేకుండా తిరగడం వంటివి కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. యువ జనాభాలో మధుమేహం, రక్తపోటు, హృద్రోగాలు వంటివాటితో బాధపడేవారు అధిక సంఖ్యలో ఉండటంతో అలాంటివారికి కొవిడ్ ముప్పు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. కాగా ఇలాంటి సమస్యల్లేని వారు కూడా చాలామంది వ్యాధి బారినపడుతున్నారు. కొవిడ్ సోకిన వారిలో వైరల్ లోడ్‌ను బట్టి ఈ తీవ్రత ఉంటుందని చెబుతున్నారు. అయితే యువతలో కొవిడ్ సోకినా లక్షణాలు కనిపించనివారే ఎక్కువ మంది ఉంటున్నారని వీరు వ్యాప్తికి కారణమవుతున్నారని చెబుతున్నారు.
నిపుణుల సూచనలు..
- అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ముక్కు, నోరు, గడ్డం ప్రాంతాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా వీటిని పెట్టుకోవాలి.
- ఒకచోట గుమిగూడవద్దు.
- భౌతిక దూరాన్ని పాటించాలి.
- చేతులను తరచూ సబ్బు,నీళ్లు లేదా శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలి.
- సామూహికంగా విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి.
- ఎట్టి పరిస్థితుల్లోనూ 'మనకేం కాదులే' అన్న దీమాతో ఉండొద్దు.
- అవసరమైతే తప్ప ఇళ్లు విడిచి బయటకు వెళ్లొద్దు.
ఇదీ చూడండి:పిడుగుపాటు ఘటనల్లో ఒక్క రోజే 31 మంది మృతి